అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో
పాల్గొంటారని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈమేరకు ఆయన గురువారం భారత్‌కు
రానున్నట్లు వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షెడ్యూల్ ప్రకారం భారత్‌కు రానున్నట్లు
శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా నిర్ధరణ
కాగా జో బైడెన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. దీంతో అమెరికా ఈ మేరకు
స్పష్టతనిచ్చింది. సోమ, మంగళవారం చేసిన కొవిడ్ పరీక్షల్లో అమెరికా
అధ్యక్షుడికి నెగిటివ్ వచ్చిందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్
తెలిపారు. బైడెన్ గురువారం ఢిల్లీ బయలుదేరుతారని, శుక్రవారం ప్రధాని మోదీతో
ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో
జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో బైడెన్ పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి
చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని చెప్పారు.
జీ-20 పట్ల అమెరికా నిబద్ధత ఏ మాత్రం తగ్గలేదన్న ఆయన, ప్రపంచంలోని ప్రధాన
ఆర్థిక వ్యవస్థలు సవాలులో కూడా కలిసి పనిచేయగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం
కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.