విజయవాడ : దేశంలోని హవాలా ఆపరేటర్లు చంద్రబాబు గాడ్ ఫాధర్ అని ఆయన
కనుసన్నల్లోనే వారు పనిచేస్తారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు
అంశాలపై ఆయన స్పందించారు. హవాలా ఆపరేటర్లు ఎవరైనా డబ్బుతో దొరికితే
వ్యవస్థల్లో తనకున్న పలుకుబడితో చంద్రబాబు విడిపిస్తాడని అన్నారు. షాపూర్జీ
పల్లోంజీ సంస్థ నుంచి 118 కోట్లు కమీషన్ గా తీసుకున్నట్టు ఐటీ శాఖ జారీ చేసిన
నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవేనని
అన్నారు. కేంద్రం వద్ద ఐటి డిపార్టుమెంటు ఉంటే తను భయపడేది లేదని “ఒక్క రోజులో
స్టే తెచ్చేస్తా. ఎన్ని నోటీసులిస్తారో ఇచ్చుకోండి” అని బాబు గట్టిగా
అరవాలనుకుంటాడు అయితే అంతలోనే వార్నింగ్ లైట్ వెలిగి సైలెంట్ అయిపోతాడని
అన్నారు. గోల చేస్తే ఇంకెన్ని అక్రమాలు బయటకు తీస్తారో అనే వణుకు బాబు నోటికి
తాళం వేసిందని అన్నారు
అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు
నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారని అయితే చంద్రబాబు అండ్ కంపెనీ
మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవచ్చని మాత్రమే ఆలోచిస్తుందని అన్నారు.
అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలన్నది బాబు పాలసీ
అని ఈ మేరకు బాబు ఆలోచన అంతా దీని చుట్టే తిరుగుతుందని అన్నారు.
అన్నీ తానే తీసుకొచ్చానని అన్నీ తానే కనిపెట్టానని గొప్పలు చెప్పుకోవడం మినహా
పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని
డిమాండ్ చేశారు. నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి తన వాళ్లను
ఉద్దరించుకోవడం కాదని తాను ప్రవేశ పెట్టిన ఒక్క పథకం, పునాది వేసి పూర్తి
చేసిన ఒక్క ప్రాజక్టు పేరైనా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.
చంద్రబాబు మానసిక స్థితి దారుణంగా దిగజారిందిని క్యూ ఆర్ కోడ్ సృష్టికర్త కూడా
తానేనని చెప్పుకుంటున్నాడని అన్నారు. 1994లో డెన్సో వేవ్ అనే టోయోటో విడిభాగాల
సంస్థ కోసం ఇంజనీర్ మాసహిరో హర క్యూ ఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ను
కనిపెడితే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడని అన్నారు. చంద్రబాబు
కనుక్కోనిది ఏదైనా మిగిలి ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.