రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి
జోగి రమేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందుతూ జగన్ పాలనలో
ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
పేర్కొన్నారు. మంగళవారం ఆయన కృత్తివెన్ను మండలం నిడమర్రు-2 గ్రామ సచివాలయం
పరిధిలోని ఒర్లగొందితిప్ప గ్రామంలో బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని
బాలశౌరితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ అమ్మఒడి దగ్గర నుంచి మత్స్యకార భరోసా వరకు క్రమం తప్పకుండా
వివిధ పథకాలను అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా
ఉంటున్నారని అన్నారు. అందరి అవసరాలను తీరుస్తున్న జగనన్నకు మీ మద్దతు,
దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి కోరారు.
ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హత
ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న
ఆయా పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయా లేదా అని ఇంటింటిని సందర్శించి
నేరుగా లబ్ధిదారులనే వాకబు చేసేందుకు ఈ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం : ఒర్లగొందితిప్ప గ్రామంలో రూ.40 లక్షల
వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
మంత్రి జోగి రమేష్ బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి
ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండలం జడ్పిటిసి మైలా
రత్నకుమారి, ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్, ఏఎంసి చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్
రావు, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెల్లా భూపతి రాజు, కాపు కార్పొరేషన్
డైరెక్టర్ పిన్నెంటి మహేష్, పార్టీ నాయకులు తలుపుల వెంకట కృష్ణారావు, రాజబాబు,
స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది,
వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.