సాంకేతిక కారణాలతోనే టీచర్ల వేతనాలు ఆలస్యం
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు
విమర్శిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం
చేశారు. సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని, 7 లేదా 8వ తేదీల్లో
టీచర్ల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఏయూ కన్వెన్షన్
హాల్లో రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు మంత్రి
బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు
మంత్రి పురస్కారాలు అందించారు. ఆయనతోపాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ
సీఎం బూడి ముత్యాల నాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు
లేవు. దీనిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం నియామకాలపై సీఎం జగన్
దృష్టి పెట్టారు. 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. నెల రోజుల్లో
అన్ని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతాం. ప్రభుత్వ పాఠశాల ముందు నో సీట్
బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ
పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా
సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోంది. ప్రధాని స్వయంగా
రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారని బొత్స వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు
చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే
ఉత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు. ‘విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం
సంతోషంగా ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే
వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య
కోసం రూ.12వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 60వేల క్లాస్ రూమ్స్‌లో
డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు మా కుటంబ సభ్యులే అని కీలక
వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కొన్ని
పత్రికలు చూస్తున్నాయి. జీతాలు ఇవ్వలేదని అవాస్తవాలు రాస్తున్నాయి. ప్రైవేటు
స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. అన్ని
యూనివర్సిటీల్లో పోస్టులన్నింటినీ డిసెంబర్‌కల్లా భర్తీ చేస్తామని స్పష్టం
చేశారు.