కొవ్వూరు : ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే
వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం కొవ్వూరు టౌన్ లిటరరీ క్లబ్
కళ్యావేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్
అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురుపూజోత్సవ్-2023’ వేడుకల్లో ఆమె ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ ’టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్యారంగంలో గతంలో ఏ
ముఖ్యమంత్రి తీసుకురానన్ని విద్యా సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
తీసుకొచ్చారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, రాజకీయ నేతలు
వంటి ఎందరినో తయారుచేసి సమాజ శ్రేయస్సుకి అందించేది ఉపాధ్యాయులే అన్నారు.
సమాజంలో ఏ విద్యార్థి ఉన్నత స్థితికి వెళ్లినా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా
ఆనందపడేది విద్యాబుద్దులు నేర్పిన గురువే అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో
ఉన్నతమైనదని, అటువంటి వృత్తిలో తాను, తమ కుటుంబం సేవలందించడం గర్వకారణమన్నారు.
మన భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి
గురువు అని, మాతృదేవోభవ.. పితృదేవోభవ..‘ఆచార్యదేవోభవ’ అంటూ మనకు
విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తామని తెలిపారు. మన తల్లిదండ్రుల
కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మన
తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు అన్నారు. మనల్ని మంచి
దారిలో నడిపించి అత్యున్నత స్థానంలో చూడాలని ఉపాధ్యాయుడు కోరుకుంటారని, తన
శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారని ఆమె
తెలిపారు. అటువంటి గురువుల పట్ల జగనన్న ప్రభుత్వానికి పూర్తి నమ్మకం, విశ్వాసం
ఉన్నాయి. వారి ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుమని తెలిపారు.
ప్రభుత్వంపై బురద జల్లాలనే ఆలోచనలతో కొన్ని ప్రతిపక్షాలు ప్రైవేట్
విద్యాసంస్థలను చిన్నచూపు చూస్తోందని ఆరోపణలు చేస్తున్నాయి. స్కూళ్లలో డ్రాప్
అవుట్లను తగ్గించాలని, బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపాలనే సమున్నత లక్ష్యంతో
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం
ప్రవేశపెట్టారన్నారు. ఎక్కడా తారతమ్యం లేకుండా పిల్లలకు మంచి భవిష్యత్
ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్లతోపాటు ప్రైవేట్ స్కూల్ లో కూడా
దేశంలో ఎక్కడా లేనివిధంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని నాలుగేళ్లుగా అమలు చేసి
చూపించారని తెలిపారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా
ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయని,
దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్
అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ
పురస్కారాలు అందజేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో పోల్చితే
ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు విశ్రాంతి తక్కువగా ఉంటుందన్నారు. పబ్లిక్ హాలిడే
రోజున ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కచ్చితంగా సెలవు ఉండేలా చర్యలు తీసుకోవాలని
హోంమంత్రి తానేటి వనిత ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో
కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, నియోజకవర్గం లోని ప్రైవేట్,
అన్ ఎయిడెడ్ స్కూల్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.