త్వరలోనే వారాహి విజయ యాత్ర నాలుగో దశ
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక
పవన్ కళ్యాణ్ కి నచ్చేలా కార్యక్రమాల రూపకల్పన
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ
ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : కేంద్రం జమిలిగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తుందని తెలుస్తోంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావాల్సి ఉంది. ఒకే దేశం-ఒకే
ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుంది. ప్రజాధనాన్ని
ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి
విషయమే. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమే. రాష్ట్రంలోనూ
ఇలాంటి మార్పు రావాలి. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
శుక్రవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల
సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే
మంచి సందేశం వెళ్తుంది. జమిలి ఎన్నికలు పాత విషయమే. గతంలోనూ లోక్ సభ, శాసన
సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. జనసేన పార్టీ ఏ
కార్యక్రమం నిర్వహించినా దాని వెనుక జనహితం కచ్చితంగా ఉంటుంది. పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిండు మనసుతో దాన్ని పాటిస్తారు. ఆయన పాటించడమే
కాదు. నాయకులు, కార్యకర్తలకు సైతం ఆచరించేలా చూస్తారు. సెప్టెంబరు 2వ తేదీ
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈసారి వేడుకలను ఘనంగా
నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాం. పవన్ కళ్యాణ్ కి నచ్చే విధంగా, ఆయన
ఆలోచనలకు తగినట్లుగా ఈసారి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తాం. దీనికోసం
మొత్తం 5 కార్యక్రమాలను చేయాలని భావిస్తున్నాం. మొదటిగా భవన నిర్మాణ
కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తాం. దీనిలో పార్టీ నాయకులు,
కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులతో కలిసి భోజనాలు చేస్తారు. వైసీపీ
ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల
కడుపు కొట్టినపుడు వారి కోసం కవాతు చేసి, అండగ నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్.
ఆకలితో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అయిదు రోజుల పాటు అప్పట్లోనే డొక్కా
సీతమ్మ స్ఫూర్తితో అన్నదానం నిర్వహించాం. వారికి కష్టకాలంలో అండగా నిలిచాం.
భవన నిర్మాణ కార్మికులను తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. వారి
మధ్య జన్మదిన వేడుకలు చేసుకోవడం ఓ గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. రెండో
కార్యక్రమంగా రెల్లి కాలనీలను సందర్శించి, అక్కడున్న వారికి సాయం చేసి వారి
మధ్యనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. తమ ఆరోగ్యాలను
పణంగా పెట్టి, సమాజంలోని అందరి ఆరోగ్యాలు కాపాడే రెల్లి సోదరుల పని తీరును మా
అధ్యక్షులవారు ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు. సమాజాన్ని శుభ్రం చేయాలంటే
రెల్లి సోదరుల తీరుగానే పనిచేయాలని భావిస్తారు. ఆయన జన్మదినాన్ని రెల్లి
సోదరుల మధ్య ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకుల కోసం
మూడో కార్యక్రమంగా ఆపదలో ఉన్నవారికి రక్తదానాన్ని చేయడం కోసం మెగా రక్తదాన
శిబిరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా మంగళగిరి పార్టీ
కేంద్ర కార్యాలయంలో కూడా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. సేకరించిన
రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల బ్లడ్ బ్యాంకులకు అందజేస్తాం. ఇక నాలుగో
కార్యక్రమంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ
హాస్టళ్లలోని పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ఇతర స్టేషనరీను ఇస్తారు. వారికి
అవసరం అయిన చదువు సాయం చేస్తారు. అక్కడున్న పేద విద్యార్థులకు తోచిన సాయం
చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక అయిదో కార్యక్రమంగా దివ్యాంగులకు ఉపయోగపడేలా
కార్యక్రమాలను నిర్వహిస్తాం. దివ్యాంగులకు అవసరం అయిన కృత్రిక అవయవాలు, మూడు
చక్రాల సైకిళ్లు, పింఛను రాని దివ్యాంగులకు అండగా నిలిచే కార్యక్రమాలను
చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ అయిదు కార్యక్రమాలూ పవన్ కళ్యాణ్ కి
వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన వ్యాపకాలు.. కార్యక్రమాలు. ఆపదలో ఉన్న వారికి
కచ్చితంగా సాయపడాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ఘనంగా
నిర్వహిస్తాం. కార్యక్రమాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, పవన్
కళ్యాణ్ అభిమానులు ఉరిమె ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
త్వరలోనే నాలుగో విడత వారాహి యాత్ర
వారాహి విజయ యాత్ర నాలుగో దశపై 15 రోజుల తర్వాత పార్టీ నాయకులతో సమావేశం
ఉంటుంది. ఎక్కడ…ఎప్పుడు అనేది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్ణయిస్తాం.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. పొత్తుల
గురించి సరైన సమయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల తేదీ పైన
స్పష్టత వచ్చాక దీనిపై ముందుకు వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసేలా
పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉంటాయన్నారు.
మెగా రక్తదాన శిబిరం ఏర్పాట్లు పరిశీలన
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో
శనివారం జరగనున్న మెగా రక్తదాన శిబిరం ఏర్పాట్లను మనోహర్ పరిశీలించారు.
రక్తదానం చేసేవారికి అనువుగా బెంచీలు వేయించాలని, ఇతర ఏర్పాట్లు లోటు రాకుండా
చూసుకోవాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి
కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని పార్టీ నాయకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా
అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి
శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పోతిన మహేష్, డా.పాకనాటి గౌతంరాజ్,
రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, వడ్రాణం మార్కండేయ బాబు, వీరమహిళ
సమన్వయకర్త బి.పార్వతి నాయుడు పాల్గొన్నారు.