సాంకేతిక విద్యా శాఖ నేతృత్వంలో అంగ్ల నైపుణ్యం, ఉపాధి అనే అంశంపై సమావేశం
విజయవాడ : బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రిడ్జ్ సంస్ధల సహకారంతో పాలిటెక్నిక్‌లు,
ఐటిఐలు, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో
తమ సేవలను విస్తరింపజేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్
ఓవెన్ తెలిపారు. పాలిటెక్నిక్‌లు, ఐటిఐలు, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆంగ్ల
భాషలో నైపుణ్యాలను పెంపొందిస్తూ ఉపాధి చూపే లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యా
శాఖ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని
నిర్వహించింది. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ మాట్లాడుతూ అంగ్ల భాషలో
నైపుణ్యంతో అంతర్జాతీయ స్దాయి విద్యను సునాయాసంగా అందుకోగలుగుతారని
వివరించారు. అంగ్లం విషయంలో ఇప్పటికే బ్రిటీష్ హైకమీషన్ భారతీయ విద్యార్ధులకు
ప్రత్యేక శిక్షణ అవకాశాలను అందిస్తుందన్నారు. తెలివి తేటలు కలిగిని భారతీయ
విద్యార్ధులు కేవలం ఆంగ్లభాషలో తగిన పరిణితి చూపలేక నష్టపోవటం ఆందోళణ
కలిగిస్తుందన్నారు. సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగ రాణి మాట్లాడుతూ
విద్యార్ధులు ఆంగ్లంలో పట్టు సాధించేలా బ్రిడ్జ్ కోర్సులను నిర్వహించేందుకు
కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కళాశాల విద్యా శాఖ కమిషనర్ పోల భాస్కర్,
మాట్లాడుతూ ఇంగ్లీష్ క్లబ్ ల ఏర్పాటుతో విద్యార్దులు ఆంగ్ల భాషలో పట్టు సాధించ
గలుగుతారన్నారు. ఉపాధి, శిక్షణా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి. నవ్య, రాష్ట్ర
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్య కె. హేమచంద్రారెడ్డి తదితరులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో పియర్సన్, కోర్టెక్స్ట్,
బ్రిటిష్ కౌన్సిల్ ఇంగ్లీష్ స్కోర్, టీమ్ కేంబ్రిడ్జ్ సంస్ధల ప్రతినిధులు
పాల్గొన్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషలో స్వల్పకాలిక కోర్సులు , శిక్షణ,
ధృవీకరణ వంటి సేవలు తదితర అంశాలను చర్చించారు. అధ్యాపకులకు స్మార్ట్ టీచింగ్,
లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ఉపకరణాలను సమావేశంలో అందించారు.