విజయ్ కుమార్
గూడూరు పట్టణంలో భారీ అన్నదాన కార్యక్రమం
సెప్టెంబర్ 3 తేదిన మల్లాంలో ఉచిత మెగా వైద్య శిబిరం
పోస్టర్లను పాంప్లేట్ లను ఆవిష్కరించిన ట్రస్ట్ ఛైర్మన్ బత్తిని విజయ్ కుమార్
జెండా ఊపి ప్రచార రధాన్ని ప్రారంభించిన బత్తిని విజయ్ కుమార్
గూడూరు : పేద ప్రజల ఆరాధ్య దైవం, ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి
వర్ధంతని పురస్కరించుకుని సెప్టెంబర్ 2 వ తేదిన గూడూరు పట్టణంలో డాక్టర్
వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ ఫౌండర్, ఛైర్మన్ బత్తిని విజయకుమార్ తెలిపారు.
శుక్రవారం గూడూరులోని చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో
ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా బత్తిని విజయకుమార్
మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో
భాగంగా డాక్టర్ వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 14 ఏళ్లుగా పేదల
సంక్షేమానికై విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ
క్రమంలో శనివారం గూడూరులోని సాధుపేటలోని వైయస్సార్ విగ్రహ ఆవరణలో పేదల కోసం
భారీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఏరియా
ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, రొట్టెల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని
చెప్పారు. సెప్టెంబర్ 3 తేదీన చిట్టమూరు మండలం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో
డాక్టర్ వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
జరుగుతుందని అన్నారు. ఈ వైద్యశిబిరంలో అనుభవం గల స్పెషలిస్ట్లచే వైద్య
పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు.
రోగులకు ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేస్తామని
చెప్పారు. ఉచిత వైద్య శిబిరాన్ని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం
చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు
ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు.