అత్యాధునిక వసతులతో మారిన బస్ స్టాండ్ రూపురేఖలు
రూ.1.8 కోట్లతో నిర్మాణం..సాకారమైన బేతంచెర్ల వాసుల స్వప్నం
నంద్యాల : సామాన్యులకు సంక్షేమం, అందరికీ అభివృద్ధి మా ధ్యేయమని ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. 1993లో తన చిన్నాన్న బుగ్గన
రామ్మోహన్ విరాళంగా ఇచ్చిన స్థలమే ఈ బేతంచెర్ల బస్ స్టాండ్ అన్నారు. నేడు
మళ్లీ ఇన్నాళ్లకు తన చేతుల మీదుగా ఆధునికీరించడం యాదృశ్చికం…సంతోషమన్నారు.
4,500 మంది నిత్యం ప్రయాణం చేసే బేతంచెర్ల బస్టాండ్ కు సంబంధించి అదనపు బస్
సర్వీసులకు కూడా అనుమతించినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. 2019లో
ప్రజలంతా ముఖ్యమంత్రిగా జగన్ ని, రెండోసారి డోన్ ఎమ్మెల్యేగా తనని
గెలిపించినందుకు వారందరి విజయానికి చిహ్నమే బస్టాండ్ నిర్మాణమన్నారు. డోన్
నియోజకవర్గ వ్యాప్తంగా డోలిలో మోసుకుని వెళ్లి ఆస్పత్రులలో కనుమకింద కొట్టాల
వంటి గ్రామానికి రహదారులు వేసినట్లు మంత్రి తెలిపారు. 175 నియోజక వర్గాల్లో
డోన్ నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని సీఎం తన పాదయాత్రలో హామీ
ఇచ్చి నేడు దాన్ని నెరవేరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారాలపై తనదైన శైలిలో మంత్రి బుగ్గన సమాధానం
సెంటున్నర ఇళ్లిస్తాం..స్థలాన్ని స్వయంగా కొనిస్తామంటూ ప్రతిపక్షాల అర్థం లేని
మాటలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనదైన శైలిలో స్పందించారు. సెంటున్నర
స్థలంలో ఒక ఎకరంలో 60 ప్లాట్లు వేస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు
కావాలనుకునే 12 వేల మందికి ఎంత స్థలం కావాలో తెలుసా అని మంత్రి సూటిగా
ప్రశ్నించారు. 500 ఎకరాల స్థలం స్వయంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కొనడం, ప్లాట్లు
వేసి, ఇల్లు కట్టడం సాధ్యమా? ప్రజలు ఈ గారడీ మాటలను నమ్మవద్దని మంత్రి బుగ్గన
తెలిపారు. ఒక్క బేతంచెర్లలోనే అర్హులకు సెంటున్నర చొప్పున ఇవ్వాలంటే కేవలం
స్థల సేకరణకే రూ.400 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
సెల్ఫీ ఛాలెంజ్ లతో సమయం గడపడం తప్పా డోన్ లో అభివృద్ధి పనులను ఆపలేరన్నారు.
రైల్వే డబ్లింగ్ పనులు, రైల్వే కమ్ అండర్ బ్రిడ్జి ఏర్పాటుపైనా విష ప్రచారం
చేసిన టీడీపీపై మండిపడ్డారు. వారంలోనే పనులు ప్రారంభమైన ఆ పనుల గురించి
ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నారు?. సెల్ఫీ ఛాలెంజ్ లతో కాలం గడిపే పార్టీలకు
జరుగుతున్న అభివృద్ధే తన ఛాలెంజ్ అన్నారు.
మంత్రి బుగ్గన సూక్ష్మపరిశీలన అద్భుతం : ఎండీ ద్వారక తిరుమలరావు
మంత్రి బుగ్గన రాజారెడ్డి హయాంలో ఊహించనంత అభివృద్ధి జరిగిందని కౌన్సిలర్
ముబీనా పేర్కొన్నారు. బస్ స్టాండ్ లో మహిళలకు టాయిలెట్ల కనీస సౌకర్యం
లేకపోవడంపై మంత్రి బుగ్గన నాడు చలించిపోయిన తీరును ఆమె ప్రస్తావించారు. 1993లో
బుగ్గన రామ్మోహన్ రెడ్డి ప్రజల సౌకర్యార్థం స్థలం విరాళంగా ఇస్తే 2023లో నేడు
మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజలు ఊహించని విధంగా వసతులతో పూర్తి చేసి
ప్రారంభించడం గొప్ప విషయమని ఎంపీపీ బుగ్గన నాగభూషణం పేర్కొన్నారు.
బేతంచెర్ల బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘నాడు-నేడు’ ఫోటో
చూశాక అధ్వాన్నం నుంచి అత్యాధునికంగా మారిన బస్ స్టాండ్ దృశ్యం చూసినవారందరికీ
అర్థమవుతుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.
బేతంచెర్ల, ప్యాపిలీ, డోన్ బస్టాండ్ ల అభివృద్ధికి మంత్రి బుగ్గన కంకణం
కట్టుకున్నారన్నారు. ప్రయాణీకుల సౌకర్యం, ఆర్టీసీ ఆదాయం పెంపు, ఆర్టీసీ
ఉద్యోగుల సంక్షేమం అనే మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందడుగు
వేస్తోందన్నారు. 15 మీటర్లతో అత్యంత పొడవైన బస్ సహా త్వరలోనే 1500 ఎలక్ట్రిక్
వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయడం సహా ప్రస్తుత ప్రభుత్వం కారుణ్య నియామకాల కింద 900 మందికి
ఉద్యోగాలివ్వడం జరిగిందన్నారు. బుగ్గన శేషారెడ్డి హై స్కూల్ లో పాలిటెక్నిక్,
ఐటీఐ, నర్సులకు సంబంధించి యువతకు శిక్షణనిస్తుంటే ప్లాట్లు వేస్తున్నట్లు
ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడంపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల
మద్దతు లేనివాళ్లు కూడా మైకు దొరికిందని అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
రూ.50 కోట్లతో శ్రీ మద్దిలేటి స్వామి ఆలయ అభివృద్ధి, రూ.40 కోట్లతో
గోరుమానుకొండ బీసీ బాలుర వసతి గృహం ఏర్పాటు, రూ.6.50 పాలుట్ల రంగనాథ స్వామి
క్షేత్రానికి రహదారి, రూ.2,300 కోట్లతో డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు,
పాలిటెక్నిక్ కాలేజీ,వాటర్ గ్రిడ్, 100 పడకల ఆస్పత్రి, ఎమ్ఎస్ఎమ్ఈ
కళాశాల,క్లబ్ హౌస్, ఇండోర్ స్టేడియం, నగరవనం, పార్కులు, ఐటీఐ కాలేజీలు,
విజిటెబుల్ మార్కెట్ ల వంటి మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధి విపక్షాలకు
కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్
యర్రబోతుల పాపిరెడ్డి, బేతంచెర్ల ఎంపీపీ నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల మున్సిపల్
ఛైర్మన్ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, ఏపీఎస్ఆర్టీసీ
ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, నంద్యాల
జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తదితరులు
పాల్గొన్నారు.