శ్రీకాకుళం : దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని
అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఒక్కరికే సాధ్యమయిందని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. వరుసగా ఐదవ ఏడాది, ఏడాదిలో తొలివిడతగా వైఎస్ఆర్ రైతు భరోసా
కింద నిధులు జమచేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి
వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా సీఎంతో సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,801 మంది కౌలు రైతులకు సుమారు రూ.12 కోట్లు
ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. అలాగే ఏ
సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తామన్న మాట
మరోసారి నిలబెట్టుకున్నారని కొనియాడారు. కేవలం రైతన్నల సంక్షేమం కోసమే జగనన్న
ప్రభుత్వం నాలుగేళ్ల రెండు నెలల కాలంలో రూ.1,70,845 కోట్లు వ్యయం చేసిందని
చెప్పారు. వ్యవసాయం అంటే దండగ అనే చంద్రబాబు ఇప్పుడు గుండెలు
బాదుకుంటున్నారని, నాశిరకం విత్తనాలు, కల్తీ పురుగు మందులు, రైతులకు
బకాయిలుపెట్టడం లాంటి చర్యలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు బాబు నక్కజిత్తులు ఈ సారి పనిచేయవని ఎద్దేవా చేశారు. ఈ
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లారకర్, డి సి సి బి చైర్మన్
కరిమి రాజేశ్వరరావు, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు,
జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ చైర్మన్ నేతాజీ, అగ్రి మిషన్ సభ్యులు గొండు
రఘురాం, వ్యవసాయ కాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఉద్యానవన శాఖ ఎడి
ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.