లక్ష మందితో తిరుపతిలో భారీ ర్యాలీ
సీమ అత్మగౌరవ యాత్ర సక్సెస్
సీఎం జగన్ తోనే సీమకు న్యాయం:ఎమ్మెల్యే భూమన
వికేంద్రీకరణకు మద్ధతుగా రాయలసీమ గర్జించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. 3 రాజధానులకు మద్ధతుగా ప్రజా సంఘాలు కదం తొక్కాయి. వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆత్మగౌరవ యాత్రతో తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, మేధావుల ఫోరం, సాహితీ వేత్తల సంఘం, విద్యార్థి సంఘాలన్నీ కలిసి చేపట్టిన ర్యాలీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.దీంతో పార్టీలకతీతంగా ఈ ర్యాలీలో వివధ వర్గాలు పాల్గొన్నాయి.
లక్ష మందితో తిరుపతి వీధుల్లో భారీ ర్యాలీ
మూడు రాజధానులకు మద్ధతుగా తిరుపతి నగరంలో శనివారం ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలతో కలిసి లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించాయి. దీంతో తిరుపతి వీధులు కిక్కిరిసిపోయాయి.< ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధానికి మద్ధతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జనకు దీటుగా రాయలసీమ ఆత్మగౌరవ యాత్రను ప్రజాసంఘాలు శనివారం నిర్వహించాయి.ఈ ర్యాలీ కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీ రోడ్డు మీదుగా మున్సిపల్ ఆఫీసు వరకు 3 కి. మీ మేర జరిగింది.
వికేంద్రీకరణకు మద్ధతుగా ప్లకార్డులు
వికేంద్రీకరణకు మద్ధతుగా తిరుపతిలో జరిగిన ర్యాలీలో వివిధ ప్రజా సంఘాలు బ్యానర్లు, ప్లకార్డులు చేతపట్టి రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నాయి.సీఎం జగన్ ముందు చూపుతోనే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందని ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులు పేర్కొన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యపడుతుందని ప్లకార్డులు ప్రదర్శించారు.
శ్రీ బాగ్ ఒడంబడిక అమలు సీఎం జగన్ తోనే సాధ్య పడుతుందని ప్రజా సంఘాలు ప్లకార్డులు ప్రదర్శించాయి. న్యాయ రాజధానిగా కర్నూలు అనేది సీమ ఆత్మగౌరవానికి ఆనవాలుగా నిలుస్తుందని ప్లకార్డుల్లో పేర్కొన్నారుతిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా ‘మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.న్యాయ రాజధాని సాధిద్ధాం’ అన్న ప్లకార్డు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
రాయలసీమలో రాజధాని ఏర్పాటుతోనే స్థానికంగా అభివృద్ధి సాధ్యపడుతుందని, రాజధాని ఏర్పాటుతో పాటు హక్కుల సాధన కోసం చేపట్టిన ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ పూర్తి సముఖంగా ఉన్నారని, కానీ చంద్రబాబు తన దుష్టశక్తులతో వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు అమరావతి కోసం పాకులాడటం హేయమన్నారు.
ప్రజా సంఘాలతో కలిసి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీలో ఆయన నడిచారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు ఈ మహాగర్జన నిలువుటద్దంగా మారిందన్నారు. హక్కుల సాధన కోసం ఈ ర్యాలీ కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు.చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. తన సొంత ప్రాంతంలో రాజధాని కోసం ప్రజలు ఉద్యమ బాట పడితే కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే తనకు రాజకీయ స్థానం లేకుండా పోతుందనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని కోసం ప్రజలు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో రాయలసీమలో న్యాయ రాజధాని కోసం కూడా ప్రజలు అంతే చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కన్నీటి రూపం ఆత్మగౌరవ యాత్ర పేరుతో బయటపడిందని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరారు. రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని, వైఎస్సార్ మనసులో పుట్టిన శ్రీ సిటీ పారిశ్రామిక కారిడార్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ వల్ల ఇటు రాయలసీమకు అటు ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు. అమరావతి పేరుతో మళ్లీ అదే వంచన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రజల మద్ధతు వుందనేందుకు విశాఖ, రాయలసీమ ర్యాలీలు నిదర్శనమని పేర్కొన్నారు.తిరుపతి ర్యాలీలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారన్నారు.ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ ఆత్మ గౌరవ యాత్ర స్వార్ధ రాజకీయాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం పాకులాడుతున్న దుష్టచతుష్టయానికి చెంపపెట్టని విమర్శించారు.రాయలసీమ మొదటి నుంచి వివక్షకు గురైందని, న్యాయ రాజధాని ఏర్పాటుతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. రాయలసీమలోని టీడీపీ నేతలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరుతో పరిపాలన కేంద్రీకృతం కావడం అంటే రాష్ట్రం మరోసారి వెనకబాటుకు గురి కావడమేనన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ఆకాంక్షించారు.రాయలసీమ చరిత్రలో న్యాయ రాజధాని ఏర్పాటు గొప్ప మైలు రాయిగా నిలుస్తుందన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగసంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలకు కృతజ్ణతలు తెలిపారు.
అలాగే టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి, తిరుపతి మేయర్ శిరీష తదితరుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీలో లక్ష మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీన్ని బట్టి వికేంద్రీకరణపై ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.వైసీ పీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజలే వై సీపీ పాలనలో నిర్ణేతలుగా ఉంటారు. వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అత్యవసరం ప్రజల ఆకాంక్షల మేరకే సీఎం జగన్ పనిచేస్తారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉంది.
వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్