సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి
విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం
విజయవాడ : టీటీడీ వంటి హిందూ బోర్డులో అన్యమతస్తులను నియమించారని, హిందువుల
మనోభావాలు దెబ్బ తిన్నా పట్టించుకోలేదని, దీనిపై పార్టీ తరఫున పోరాటం
చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం
చేశారు. గురువారం విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి
శ్రీకారం చుట్టారు. బీజేపీ సోషల్ మీడియా , ఐటి ప్రతినిధులకు వర్కుషాపు
నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ పేదల కోసం గ్యాస్‌పై రూ. 2
వందలు తగ్గిస్తే దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎన్టీఆర్ నాణెం
ఆవిష్కరణలో తమ (నందమూరి) కుటుంబం అంతా పాల్గొందని, మా తరువాత వారసులు కూడా
తాతపై ప్రేమతో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన
కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రపతి
పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. సజ్జల, విజయసాయి రెడ్డి ల
వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు.
కేంద్రం ఏపీకి చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమ ప్రతినిధులు
వివరిస్తారని పురంధేశ్వరి అన్నారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలని
పిలుపిచ్చారు. సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తోందని, సమాజంలో సోషల్ మీడియా
అంశాలపైనే చర్చ సాగుతోందన్నారు. సోషల్ మీడియాలో ఎలా పనిచేయాలో శిక్షణ
ఇస్తామన్నారు. ఎన్నికల సమర శంఖం పూరించేలా శంఖానాదం అని పేరు పెట్టామన్నారు.
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, రాఖీ పండుగ
సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారన్నారు. రాష్ట్రంలో
గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై తాము పోరాటం చేశామని, బీజేపీ మిత్ర పక్షమైన
జనసేనతో కలిసి ఆందోళనలు నిర్వహించామని పురంధేశ్వరి తెలిపారు. అన్ని అంశాలను
గవర్నర్‌కు, కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేశామన్నారు. ‘నా భూమి, నాదేశం’
కార్యక్రమం బీజేపీ చేపట్టిందని, సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని
గ్రామాల్లో మట్టిని సేకరిస్తామన్నారు. పట్టణాలు, నగరాల్లో బియ్యం
సేకరిస్తామని, ఆ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో
అమృత వనం ఏర్పాటు చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.