మంచి అనుభవం ఉన్న వారినే న్యాయ నిర్ణేతలుగా నియమించాం * తుది ప్రదర్శనకు
సెప్టెంబరు 19 కల్లా కళాబృందాలను ఎంపిక చేస్తాము * రాష్ట్రంలోని కళాకారులు
అందరికీ గుర్తింపు కార్డులు జారీచేస్తాము * రాష్ట్ర ఫిల్ము, టివి, థియేటర్
డవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి
వెలగపూడి సచివాలయం : ప్రభుత్వం నిర్ణయించిన ఐదు విభాగాల్లో నంది నాటక
అవార్డులకు ఎటు వంటి విమర్శలకు తావులేకుండా ఉత్తమ కళాకారులను ఎంతో పారదర్శకంగా
ఎంపిక చేస్తున్నట్లు రాష్ట్ర పిల్ము, టివి, థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్
చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. బుధవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
ఆవరణలోని రాష్ట్ర పిల్ము, టివి, థియేటర్ డవలెప్మెంట్ కార్యాలయంలో చైర్మన్
పోసాని కృష్ణ మురళి, మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ కుమార్ రెడ్డి జ్యూరీ
సభ్యులతో సమావేశమై ప్రాథమిక పరిశీలనకు సభ్యులు అనుసరించాల్సిన విధి విదానాలను,
పారదర్శకంగా వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అనంతరం వెలగపూడి ఆంధ్రప్రదేశ్
సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో చైర్మన్ పోసాని కృష్ణ మురళి
పాత్రికేయులతో మాట్లాడుతూ నంది నాటక పురస్కారాలకై ఉత్తమ కళాకారులను ఎంపిక
చేసేందుకు అనుసరిస్తున్న ప్రక్రియను వివరించారు. ఈ అవార్డులకు కళాకారుల పతిభ,
సామర్థ్యం ఆధారంగానే ఉత్తమ కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ ఎంపికలో
ఎటు వంటి సిఫార్సులకు తావుఉండదని ఆయన స్పష్టంచేశారు. విభాగాల వారీగా ఎంతో
అనుభవం ఉన్న వారినే న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందన్నారు. న్యాయ
నిర్ణేతల ప్రొఫైల్స్ ను రాష్ట్ర పిల్ము, టివి, థియేటర్ డవలెప్మెంట్
అఫీషియెల్ వెబ్ సైట్ లో అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుచున్నదన్నారు.
నిర్ణయించిన కార్యాచరణ ప్రకారం ఈ న్యాయ నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో పర్యటన
జరిపి విభాగాల వారీగా తుది ప్రదర్శనకు కళాకారులను ఎంపిక చేయడం
జరుగుతుందన్నారు. పద్య నాటక విభాగానికి సంబందించిన న్యాయ నిర్ణేతలు తమ
పర్యటనను సెప్టెంబరు 8 న కర్నూలు నుండి ప్రారంభించి 18 వ తేదీతో
విశాఖపట్నంలో ముగిస్తారన్నారు. సాంఘిక నాటకం, యువజన నాటిక విభాగం న్యాయ
నిర్ణేతలు సెప్టెంబరు 10 న పిఠాపురంలో ప్రారంభమై 18 వ తేదీతో కర్నూలులో తమ
పర్యటనను ముగిస్తారన్నారు. అదే విధంగా సాంఘిక నాటికలు, బాలల నాటికల న్యాయ
నిర్ణేతలు సెప్టెంబరు 7 న అనంతపురంలో ప్రారంభమై 18 వ తేదీన విశాఖపట్నంలో తమ
పర్యటనను ముగిస్తారన్నారు. తుది ప్రదర్శనకు అర్హమైన కళా బృందాలను సెప్టెంబరు
19 వ తేదీ కల్లా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
న్యాయ నిర్ణేతలు వీరే : నాటక రంగ తెలుగు రచనలకు సంబందించి ఆచార్య అప్పాజోస్యుల
సత్యనారాయణ (చీరాల), ఆచార్య గుమ్మా సాంబశివ రావు (విజయవాడ) మరియు ఆచార్య
ఎన్.వి.కృష్ణారావును (గుంటూరు) న్యాయ నిర్ణేలుగా నియమించడం జరిగిందన్నారు.
పద్యనాటక విభాగానికై కురుటి సత్యం నాయుడు (విశాఖపట్నం), ఎమ్.కుమార్ బాబు
(తెనాలి), మెతుకపల్లి సూర్య నారాయణ యాదవ్ (ఏలూరు); సాంఘిక నాటకం, యువజన
నాటికకు ఆకుల మల్లేశ్వర రావు (తిరుపతి), పి.శివ ప్రసాద్ (విశాఖపట్నం),
ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ (ప్రొద్దుటూరు) మరియు సాంఘిక, బాలల నాటిక విభాగానికి
డా.కె.జి.వేణు (విశాఖపట్నం), డా.దాసిరి నల్లన్న (తిరుపతి) మరియు పి.సుమ
(సుబ్రహ్మణ్యం) (ఒంగోలు) వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందని ఆయన
తెలిపారు .
*విభాగాల వారీగా అందిన ధరఖాస్తులు : ఈ ఏడాది పద్య, సాంఘిక నాటకం, బాలల, యువజన
నాటికలతో పాటు నాటక రంగ తెలుగు రచనలు అనే ఐదు విభాగాల్లో నంది నాటక
పురస్కారాలను అందజేసేందుకు అర్హులైన కళాకారులు, రచయితల నుండి మొత్తం 118
ధరఖాస్తులు అందాయన్నారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగానికై 3
ధరఖాస్తులు, పద్యనాటకానికై 26, సాంఘిక నాటకానికై 22, యువజన నాటికకు 9,
సాంఘిక నాటికకు 49, బాలల నాటిక విభాగం క్రింద 9 వెరసి మొత్తం 118 ధరఖాస్తులు
అందినట్లు ఆయన తెలిపారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగం క్రింద ఒక
పుస్తకాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా పద్యనాటకానికై 10
ధరఖాస్తులను, సాంఘిక నాటకానికై 6, యువజన నాటికకు 5, సాంఘిక నాటికకు 12, బాలల
నాటిక విభాగం క్రింద 5 వెరసి మొత్తం 39 ధరఖాస్తుదారులను తుది ప్రదర్శన కోసం
ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం : రాష్ట్రంలోని కళాకారులు అందరికీ
గుర్తింపు కార్డులు జారీచేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం
జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి చెందిన కళాకారులు ఎక్కడున్నా సరే
వారికి ఈ గుర్తింపు కార్డులు జారీచేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆ
కళాకారుల వివరాలను అన్నింటిని రాష్ట్ర ఫిల్ము, టివి, థియేటర్ డవలెప్మెంట్
అఫీషియెల్ వెబ్ సైట్ లో అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుచున్నదన్నారు. ఏజంట్ల
ప్రమేయం ఏమాత్రం లేకుండా సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఎటు వంటి కళాకారులు
కావాల్సి ఉన్నా నేరుగా వారి వివరాలను అందజేయడం జరుగుతుందన్నారు. తద్వారా
కళాకారులు సినిమా నిర్మాతలు, దర్శకుల నుండి నేరుగా జీవనోపాది పొందేందుకు
అవకాశం ఏర్పడు తుందన్నారు. అదే విధంగా ఏజంట్లకు ఎటు వంటి కమిషన్
చెల్లించాల్సిన పరిస్థితి కూడా తలెత్తదని ఆయన తెలిపారు.