అత్యంత భద్రత నడుమ అంత్యక్రియలు పూర్తి
వాగ్నర్ గ్రూప్ అధిపతిగా ఓ వెలుగు వెలిగిన ప్రిగోజిన్
రష్యా : ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత నమ్మకస్తుడిగా
పేరుగాంచిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం,
కొన్నిరోజుల వ్యవధిలోనే ఘోర విమాన ప్రమాదంలో మరణించడం ప్రపంచాన్ని
ఆశ్చర్యపరిచింది. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న ప్రిగోజిన్
విమానం మార్గమధ్యంలోనే కూలిపోయింది. ఎలా కూలిపోయిందన్నది ప్రస్తుతానికి ఓ
మిస్టరీ. తాజాగా ప్రిగోజిన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒకప్పటి తన
అంతరంగికుడి అంతిమ సంస్కారాలకు పుతిన్ దూరంగా ఉన్నారు. పొర్ఖొవ్ స్కయా
శ్మశానవాటికలో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ ను ఖననం చేశారు. దీనిపై రష్యా
అధ్యక్ష భవనం స్పందించింది. ప్రిగోజిన్ అంత్యక్రియలకు హాజరయ్యే ఉద్దేశం పుతిన్
కు లేదని స్పష్టం చేసింది.
కాగా ఇకపై వాగ్నర్ గ్రూపు ఉంటుందా, ఒకవేళ ఉంటే ఆ గ్రూపుకు ఎవరు నాయకత్వం
వహిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఒకప్పుడు పుతిన్ పర్సనల్ చెఫ్
అనిపించుకున్న ప్రిగోజిన్ చివరికి పుతిన్ పైనే తిరుగుబాటు చేస్తాడని ఎవరూ
ఊహించలేదు. తిరుగుబాటును మధ్యలోనే ఆపేసినప్పటికీ, పుతిన్ తో వైరం అతడి
ప్రాణాలను బలి తీసుకుందని రక్షణ రంగ నిపుణులు, ప్రపంచ రాజకీయ ప్రముఖులు
అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు దొంగతనాలు, దోపిడీల్లో ఆరితేరిన ప్రిగోజిన్
తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాక కొత్త జీవితం ప్రారంభించాడు.
90వ దశకంలో పుతిన్ తో పరిచయం ప్రిగోజిన్ జీవితాన్ని మలుపుతిప్పింది. రష్యా
ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఈ మాజీ నేరస్తుడికి చెందిన సంస్థలకే దక్కాయంటే
పుతిన్ తో అతడి స్నేహం ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికే రష్యా
వ్యాప్తంగా రెస్టారెంట్లు స్థాపించిన ప్రిగోజిన్… తనలాంటి మాజీ నేరస్తులను
చేరదీసి వాగ్నర్ గ్రూపు పేరిట బలమైన ప్రైవేటు సైన్యాన్ని సృష్టించాడు. పుతిన్
‘అనుకున్న పనులు’ చేసి పెట్టడం ఈ గ్రూపు ముఖ్య విధి. అయితే, ఉక్రెయిన్ యుద్ధం
పుతిన్, వాగ్నర్ గ్రూపు మధ్య చిచ్చు పెట్టింది. రష్యా సైన్యంతో విభేదాలు
అతడిని ఏకంగా క్రెమ్లిన్ పైనే తిరుగుబాటు చేసేలా పురిగొల్పాయి.