విజయవాడ : చిరునవ్వుతో డ్యూటీ చేయడం ఒక మంచి అలవాటు అని, నవ్వుతూ పనిచేసేవారు
ఎంత పని అయినా సునాయాసంగా చేసేస్తుంటారని, సంస్థ సిబ్బంది, ఉద్యోగులు ఆ
మార్గంలో నడవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి హెచ్. ద్వారకా తిరుమల రావు
అన్నారు. మంగళవారం విజయవాడ విద్యాధరపురం నందలి ఏపీఎస్ ఆర్టీసీ ట్రాన్స్ పోర్ట్
అకాడమీలో జరిగిన సమీక్షా సమావేశానికి ఎం.డి ద్వారకా తిరుమల రావు విచ్చేసి
వివిధ స్క్వాడ్ ల పర్ఫార్మెన్స్ పనితీరును సమీక్షించారు. సమావేశానికి హాజరైన
రాష్ట్రంలోని వివిధ హెడ్ క్వార్టర్ స్క్వాడ్ / విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్
స్క్వాడ్ / రీజినల్ ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్ విభాగాల ఇంచార్జ్ లను
ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎం.డి మాట్లాడుతూ సంస్థ రూల్స్ కు లోబడి ఎవరికి కేటాయించిన
విధులు వారు నిర్వహించుకుంటూ పోవాలని సూచించారు. ప్రయాణీకులకు నాణ్యమైన
సేవలందించడంలో కండక్టర్లు, డ్రైవర్లు తమ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చేలా,
వారు క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడడంలో తనిఖీ అధికారులు తమ వంతు బాధ్యతలు
నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి
పరిస్థితులలోనూ సహించరాదని, సెల్ ఫోనులో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మధ్యపానం
చేసి డ్యూటీ చేయడం, టికెట్ల మరియు నగదు అవకతవకలకు పాల్పడడం వంటి పనులను
సీరియస్ గా పరిగణించాలన్నారు. డ్యూటీలో బస్సు సిబ్బంది ఎలాంటి అవకతవకలకు
పాల్పడకుండా, స్క్వాడ్ ఉంటుందనే తలంపు బస్సు సిబ్బంది మదిలో ఉండేలా వాళ్ళు
అప్రమత్తంగా విధులు నిర్వహించేలా స్క్వాడ్ సిబ్బంది తమ డ్యూటీలు చురుకుగా
నిర్వహించాలన్నారు. సంస్థ ఆర్జించే రాబడిలో ఏ ఒక్క రూపాయి కూడా నష్టపోని
తీరులో తనిఖీ వ్యవహారాలు అప్రమత్తంగా నిర్వహించాలని మేనేజింగ్ డైరెక్టర్ సి
హెచ్. ద్వారకా తిరుమల రావు తనిఖీ అధికారులనుద్దేశించి మాట్లాడారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ. కోటేశ్వరరావు మాట్లాడుతూ స్క్వాడ్
సిబ్బంది ఇంకా మెరుగైన పనితీరు కనబరుస్తూ బస్సు సిబ్బంది అవకతవకలను గుర్తించి
వారి ప్రవర్తన సరిచేసేలా డ్యూటీలు చేయాలన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 55 మంది తనిఖీ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా
డ్యూటీలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, తనిఖీల సమయంలో తీవ్రస్థాయి టికెట్, నగదు
అవకతవకలను గుర్తించిన స్క్వాడ్ సిబ్బందిని ప్రోత్సహిస్తూ 6 స్క్వాడ్ విభాగాలలో
ఒక్కో విభాగానికి ఇద్దరు చొప్పున మొత్తం 12 మందికి ఒక్కొక్కరికి రూ.1000
చొప్పున నగదు బహుమతులు ఎం. డి ద్వారకా తిరుమల రావు, చేతుల మీదుగా అందచేశారు.ఈ
కార్యక్రమంలో ఇంకా సిటీఎం (మార్కెటింగ్) శ్రీమతి విజయగీత, ట్రాన్స్ పోర్ట్
అకాడమీ ప్రిన్సిపాల్ కుమారి డి.సాంబ్రాజ్యం, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్
ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, డిప్యూటీ సిటీఎం (మార్కెటింగ్) జాన్ సుకుమార్
ఇంకా తదితర అధికారులు పాల్గొన్నారు.