‘సైబర్ సెక్యూరిటీ’పై శిక్షణకు వారం రోజుల్లోనే పోర్టల్ ద్వారా 900 మంది నమోదు
5 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమం
ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ వినోద్ కుమార్
అమరావతి : గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు సరికొత్త రంగాల్లో
శిక్షణ అందించే అన్ని మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని
ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో యువతకు నైపుణ్యం అందించే కార్యక్రమాలపై
ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి
సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కేఎల్ యూ వేదికగా అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ‘సైబర్ సెక్యూరిటీ’పై 5 రోజుల పాటు
జరగనున్న ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య
అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్వ విద్యాలయంలోని జాస్మిన్
సమావేశమందిరంలో ప్రార్థన గీతంతో ప్రారంభమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
విచ్చేసిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో మాట్లాడుతూ ఉపాధి వేటలో
నైపుణ్యం,టెక్నాలజీదే కీలక పాత్ర అన్నారు. చేసే ప్రతి పనిలో, ఎంచుకునే ప్రతీ
రంగంలో మంచిచెడు ఉంటాయన్నారు. టెక్నాలజీని కూడా అభివృద్ధి దిశగా సద్వినియోగం
చేసుకోవాలన్నారు. వియత్నం, దక్షిణ కొరియా దేశాలలో ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి
డిమాండ్ ఉందని ఇటీవల తన తాజా పర్యటన ద్వారా తెలుసుకున్నానని ఎండీ వివరించారు.
అమెరికా బదులు తమ దేశాలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ నిపుణులను పంపాలని అక్కడి
ప్రభుత్వాలు కోరాయన్నారు. ప్రస్తుత సమాజంలో సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్ ద్వారా మనకు కావాల్సిన విషయాలు తెలుసుకోవడం, మనకు కావాల్సిన
అంశాలను ఎంచుకోవడం సులభంగా మారాయన్నారు. ‘సైబర్ సెక్యూరిటీ’పై శిక్షణ అనగానే
వారం రోజుల్లో సుమారు 900 మంది వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడం యువతకు
టెక్నాలజీపట్ల ఆసక్తికి ఉదాహరణగా ఆయన అభిప్రాయపడ్డారు.డ్రోన్ టెక్నాలజీ,
ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లను ఏర్పాటు
చేస్తున్నట్లు స్పష్టం చేశారు. టెక్నాలజీకి సంబంధించిన ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’
మూవీ గురించి ఈ సందర్భంగా ఎండీ వినోద్ కుమార్ ప్రస్తావించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ అందించే శిక్షణ కార్యక్రమాల్లో 70శాతం ఐ.టీ,
ఇంజనీరింగ్ సంబంధించనవే అని ఎండీ తెలిపారు. అనంతరం వడ్డేశ్వరంలోని కేఎల్
విశ్వవిద్యాలయంలో స్కిల్ సెంటర్ ను ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ పరిశీలించారు.
జర్మన్ భాషపై అందిస్తోన్న ఉచిత ఆన్లైన్ శిక్షణా తరగతుల తీరును ఆ దేశ
శిక్షకుల ద్వారా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ‘అకాటి సెక్యూరిటీ’
సీఈవో కృష్ణ రాజగోపాల్, డైరెక్టర్ ఆఫ్ కస్టమర్ & పార్ట్ నర్
ఎనేబుల్మెంట్,ఏపీఏసీ డేవిడ్ షెర్లీ, ‘స్టెల్లార్ సైబర్ కులాలంపూర్’ ఎస్ఈ
మేనేజర్ ర్యాన్ న్గయ్, ‘కన్సార్టియం ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ డైరెక్టర్
అలగర్ సామి, కేఎల్ యూ డీన్ ఏ.శ్రీనాథ్, కేఎల్ఈసీ ప్రిన్సిపల్ టి.రామకృష్ణ
రావు, ఏపీఎస్ఎస్డీసీ సీజీఎం (టెక్నికల్) రవి గుజ్జుల పాల్గొన్నారు.