బెంగళూరు : జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో కాలుమోపిన చంద్రయాన్-3
ఇప్పటికే తన పని మొదలుపెట్టింది. ఈ క్రమంలో మిషన్‌కు సంబంధించిన మొదటి
శాస్త్రీయ పరిశోధన వివరాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్‌లోని ‘చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్
ఎక్స్పెరిమెంట్’ (చాస్టే) పరికరం చందమామ ఉపరితలంపైన, కాస్త లోతులో సేకరించిన
ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్ రూపంలో వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం
వద్ద ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇది మొదటి డేటా అని, పూర్తిస్థాయి పరిశీలనలు
జరుగుతున్నాయని చెప్పింది. చాస్టే. చంద్రుడి నేల పైపొర ఉష్ణోగ్రతలను
లెక్కిస్తుంది. దీన్ని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్
(పీఆర్ఎల్) భాగస్వామ్యంతో ఇస్రోకు చెందిన స్పేస్ ఫిజిక్స్ ల్యాబ్
(ఎస్పీఎల్) అభివృద్ధి చేసింది. నియంత్రిత పద్ధతిలో చంద్రుడి ఉపరితలం నుంచి
10 సెంటీమీటర్ల లోతువరకూ చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను నమోదు చేసే సామర్థ్యం ఈ
పరికరానికి ఉంది. ఇందుకు 10 సెన్సర్లు ఉన్నాయి. తాజాగా చంద్రుని ఉపరితలంపై
50.5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే, 80 మి.మీల లోతులో మైనస్ 10
డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నట్లు చాస్టే గుర్తించింది.
భారీ వైరుధ్యం ఆసక్తికరం : విక్రమ్ ల్యాండింగ్ ప్రదేశంలో ప్రస్తుతం
ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకూ
ఉండొచ్చని తాము అంచనా వేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ
వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ‘‘భూమి ఉపరితలం నుంచి 2-3 సెంటీమీటర్ల
మేర లోపలికి వెళ్లి పరిశీలించినప్పుడు ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలు 2-3 డిగ్రీల
సెల్సియస్ మించవు. చందమామ విషయంలో మాత్రం ఈ తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇది చాలా ఆసక్తికరం’’ అని తెలిపారు.