డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి
అవసరమైతే మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్ళు
విండ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపైనా దృష్టి సారించాలి
వాతావరణ ప్రతికూలత వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది
బయటి మార్కెట్ లో కూడా విద్యుత్ లభ్యత సులువుగా లేదు
జెన్కో విద్యుత్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో పనిచేయించాలి
విద్యుత్ కోతలు లేకుండా ముందుచూపుతో ప్రణాళిక సిద్దం చేయాలి
మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై ఎపి జెన్క్, ట్రాన్స్ కో, డిస్కంల
అధికారులతో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా
సమావేశం నిర్వహించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఇంధనశాఖ
అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సరైన రీతిలో
వర్షాలు లేకపోవడం, పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్
వినియోగం పెరిగిందని అన్నారు. గత ఏడాది ఇదే సమయానికి 192.03 మిలియన్ యూనిట్ల
డిమాండ్ ఉంటే, ఈ ఏడాది 228.94 మిలియన్ యూనిట్ల డిమాండ్ కొనసాగుతోందని అన్నారు.
అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19.22 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని
పేర్కొన్నారు. రాష్ట్రంలోని జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లను పూర్తి స్థాయిలో
పనిచేయించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని అవసరానికి అనుగుణంగా సమన్వయం
చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి
జల విద్యుత్ ను ఉత్పత్తి చేయలేక పోతున్నామని, అదే క్రమంలో సీలేరు వంటి
ప్రాజెక్ట్ లను సాధ్యమైనంత మేర వినియోగంలోని తీసుకువస్తున్నామని అన్నారు.
కృష్ణపట్నంలోని మూడు యూనిట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని
పెంచుకోవాలని సూచించారు. విజయవాడలోని ఎన్టిటిపిసిలో కూడా 800 మెగావాట్ల
యూనిట్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. బయటి మార్కెట్ లో
కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలని, అయితే ఈ సీజన్ లో విద్యుత్
లభ్యత కూడా పరిమితంగా ఉండటం వల్ల దానిపైనే ఆధార పడకూడదని అన్నారు.
రాష్ట్రంలోని థర్మల్, విండ్, సోలార్ ప్లాంట్ ను సమర్థంగా పనిచేయించడం ద్వారా
డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని కోరారు. రాష్ట్ర
వ్యాప్తంగా 33కెవి సబ్ స్టేషన్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 30 సబ్
స్టేషన్లు పూర్తి చేసుకున్నామని, మరో అయిదు స్టేషన్లను ఈ నెలాఖరు నాటికి
పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఎండి కెవిఎన్
చక్రథర్ బాబు, జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్ బివి రెడ్డి, ట్రాన్స్ కో గ్రిడ్
డైరెక్టర్ భాస్కర్, ట్రాన్స్ కో ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రారెడ్డి, ఇంధనశాఖ
జాయింట్ సెక్రటరీ కుమార్ రెడ్డి, డిస్కం సిఇఓలు సంతోష్ రావు, పద్మా జనార్థన్
రెడ్డి పాల్గొన్నారు.