చదువుకోవడానికి డబ్బులేక కలలు కల్లలు
అన్నీ ఉచితమేనంటూ హామీలిచ్చి ముఖం చాటేసిన ప్రభుత్వం
డాక్టర్ కాలేక నర్సయిన వైనం
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి.
ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. <br><br>
యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు :యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది.
స్కూల్లో సెలబ్రిటీయే :ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి.
మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది.