సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది. దిల్లీ: దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది. సవరించిన ధరలపై త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సవరించిన ధరల ప్రకారం.. ఇకపై ఆటో ఎక్కిన ప్రయాణికుడు తొలి 1.5 కి.మీలకు (మీటర్ డౌన్ ఛార్జి) రూ.30లు (గతంలో రూ.25లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ప్రతి కి.మీకు చెల్లించాల్సిన ఛార్జి గతంలో రూ.9.50లుగా ఉండగా.. దాన్ని తాజాగా రూ.11కు పెంచారు. ఇక ట్యాక్సీ విషయానికి వస్తే.. ఏసీ, నాన్ ఏసీ వాహనాలకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. ఏసీ వాహనాలకు మీటర్ డౌన్ తర్వాత ప్రతి కి.మీ.కు కనీస ఛార్జిని రూ.16 నుంచి రూ.20కి పెంచగా.. నాన్ ఏసీ వాహనాలకు రూ.14 నుంచి రూ.17కి పెంచారు. ఆటో ఛార్జీలు చివరి సారిగా 2020లో సవరించగా.. ట్యాక్సీల ఛార్జీలను 2013లో సవరించారు. అయితే, ఛార్జీలు పెంచాలంటూ ఆటో రిక్షా, ట్యాక్సీ అసోసియేషన్ల నుంచి దిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్కు పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఛార్జీలను పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.