ఢిల్లీ వేదికగా “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్”
ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలక అడుగు
లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం
2 రోజుల కీలక సదస్సులో ఏపీ వాణిని వినిపించే అవకాశం పొందిన మంత్రి విడదల రజిని
ప్రజంటేషన్ అనంతరం ‘మహిళల డిజిటల్ హెల్త్’ లోగో ఆవిష్కరణ
అమరావతి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీకి పయనమవనున్నారు. అక్టోబర్ 28, 29 తేదీలలో ఢిల్లీ వేదికగా జరగుతున్న “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్” లో మంత్రి పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో ‘ఆరోగ్య సంరక్షణ’ విప్లవంలా ముందుకెళుతున్న విషయాన్ని ప్రపంచస్థాయి కీలక సదస్సులో 29వ తేదీ (శనివారం) సాయంత్రం 5గం.లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాణిని మంత్రి రజిని వినిపించనున్నారు. “మహిళల కోసం డిజిటల్ హెల్త్” నేపథ్యంతో తీర్చిదిద్దిన లోగోను మంత్రి ఆవిష్కరిస్తారు. లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం (4As) విధానంలో మరో మలుపు తీసుకుంటున్న విషయాన్ని ప్రధానంగా వివరించనున్నారు.
ఇప్పటికే డిజిటల్ హెల్త్ దిశగా ఏపీ తీసుకున్న సంస్కరణలు, దార్శినిక నిర్ణయాలను చాటి చెప్పనున్నారు. ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలకంగా అడుగులు వేస్తున్న అంశంపై ఆమె చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవల డిజిటలైజేషన్, పీపీపీ పద్ధతిలో ఏపీలో మెడికల్ టీచింగ్ యూనివర్శిటీ, రీసెర్చ్ వర్సిటీ ఏర్పాటు, సమగ్ర సదుపాయాలతో కాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో 16 చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి గల అవకాశాలను మంత్రి విడదల రజిని ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రస్తావించనున్నారు. ఈ సదస్సుకు నీతి ఆయోగ్ సభ్యులు, ఆయూష్ సెక్రటరీ, గ్లోబల్ డిజిటల్ హెల్త్ సీనియర్ డైరెక్టర్, ఎయిమ్స్ ఢిల్లీ చీఫ్, ఇన్వెస్ట్ ఇండియా ఎండీ, విష్ సీఈవో, వైద్యరంగంలోని వివిధ విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, సలహాదారులు, వైద్యాధికారులు హాజరవుతారు.