శాసన సభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్
వెలగపూడి సచివాలయం :
రాష్ట్ర శాసన మండలి, రాష్ట్ర శాసన సభా ప్రాంగణాల్లో మంగళవారం 77 వ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసన మండలి ప్రాంగణంలో
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో శాసన
సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ వరుసగా జాతీయ జెండాలను ఎగురవేసి వందన సమర్పణ
చేశారు. వేరు వేరుగా జరిగిన ఈ జెండా వందన కార్యక్రమంలో తొలుత వారిరువురూ
ఎస్పిఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ
చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ
జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రజలు అందరికీ 77 వ
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర
శాసన మండలి, రాష్ట్ర శాసన సభా అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ
శుభాకాంక్షలను తెలిపారు.
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ
ఎందరో మహానుబావుల ప్రాణ త్యాగాల ఫలితంగా మన దేశానికి
స్వాంతంత్ర్య్ర సిద్దించిందని, అటు వంటి మహానుబావులు అందరికీ శిరస్సు వంచి
శ్రద్దాంజలి ఘటిస్తున్నానన్నారు. దేశంలోని ప్రజలు అందరూ కుల, మత, ప్రాంత,
భాషా, సంస్కృలకు అతీతంగా బిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ
దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అయితే అన్ని రంగాల్లో
మన దేశం సమగ్రంగా అభివృద్ది చెందుతున్నప్పటకీ ఆ మహానుబావుల ఆశయాలకు,
లక్ష్యాలకు బిన్నంగా ఇప్పటకీ సమాజంలో పలు దుస్సంఘటనలు చోటు చేసుకోవడం ఎంతో
దురదృష్టకరమైన అంశమన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ
స్పూర్తికి తూట్లు పొడిచే విధంగా స్త్రీ స్వాతంత్ర్యానికి, హక్కులకు భంగం
కలిగిస్తూ ఈ మద్య కాలంలో దేశంలో జరిగిన ఒక దుస్సంఘటన దేశ చరిత్రలో మాయని
మచ్చగా నిలిచిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో దేశ ప్రజలు అంతా
ఎంతో అప్రమత్తంగా ఉంటూ మన పూర్వీకులు సాధించిన స్వాంతంత్ర్యాన్ని, స్వేచ్చను
హరించాలని ప్రయత్నించే మతోన్మాధులకు, ఉగ్రవాదులకు, ప్రాంతీయవాదులకు ప్రజలే
మంచి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన సంపూర్ణ
స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు దేశంలో ఫరిడవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అదే
విధంగా రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో పాలన ఎంతో చక్కగా
జరుగుతున్నదని అభినందిస్తూ, రాష్ట్ర ప్రజలు అంతా స్వేచ్చాయుత వాతావరణంలో మంచి
సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర శాసన
సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలను రాష్ట్రంలోని
నిరుపేద ప్రజలు అందరికీ అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్
రెడ్డి పలు వినూత్న పథకాలను రూపొందించి రాష్ట్రంలో అమలు పర్చడం
జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని, నిరక్షరాశ్యత,
నిరుద్యోగం పోవాలని, నిరుపేదలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించాలనే
లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా నిరుపేద ఇంటి
ముంగిటకే స్వాతంత్ర్య ఫలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకు వెళుతున్నారని
కొనియాడారు. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాలు,
వెల్నెస్ కేంద్రాలు, పాల విప్లవం కోసం బల్స్ కూలింగ్ కేంద్రాలు, విజ్ఞానాన్ని
అందరికీ పంచాలనే లక్ష్యంతో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడం
జరుగుచున్నదన్నారు. మహిళా సాధికారత, స్వావలంభన కోసం పలు మహిళా సంక్షేమ,
అభివృద్ది పథకాలను కూడా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలోని నిరుపేద
విద్యార్థులు కూడా ప్రపంచ విజ్ఞాన వేదికపై విశ్వవిజేతలుగా నిలబడాలనే లక్ష్యంతో
పలు విద్యాభివృద్ది పథకాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. పలు వినూత్న పథకాల
అమల్లో దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రం నిలుస్తున్నదని కొనియాడారు.
సద్విమర్శలను స్వీకిరిస్తామని, దురుద్దేశ పూర్వకంగా చేసే విమర్శనలను ఏమాత్రము
పట్టించుకోకుండా లక్ష్య సాదన దిశగా తమ ప్రభుత్వం ముందుకు అడుగులు
వేస్తున్నదన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు
వెళ్లే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయబోదని, 77 వ స్వాతంత్ర్య ఫలాలను గ్రామ
స్థాయిలోని నిరుపేదలకు అందించడం ఏ మాత్రం వెన్నుచూపబోదని ఆయన
పునరుద్ఝాటించారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీ
వచనానుసారం, పట్టణ ప్రాంత ప్రజలతో సమానంగా గ్రామీణులకు కూడా నాణ్యమై జీవన
ప్రమాణాలు, సౌకర్యాలు, అభివృద్ది ఫలాలు అందించడంతో తమ ప్రభుత్వం అవిరళ
కృషిచేస్తున్నదన్నారు.
రాష్ట్ర శాసన
సభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, డిప్యుటి సెక్రటరీలు విజయరాజు, కె.రాజ్
కుమార్, రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ తదితరులతో పాటు శాసన మండలి, శాసన సభ
అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.