ఆర్టీసీ హౌస్లో ఘనంగా 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం విజయవాడ ఆర్టీసీహౌస్ లో
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ ఛైర్మన్
ఎ.మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. వారికి ఏపీఎస్ఆర్టీసీ
మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. ద్వారకా తిరుమల రావుకు ఆర్టీసీ భద్రతా సిబ్బంది
హార్ధిక స్వాగతం పలికారు. సంస్థ ఛైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డి జాతీయ జెండా
ఎగురవేసి వందన సమర్పణ చేసి, భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన మార్చ్ పాస్ట్ లో
గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎగ్జిక్యూటివ్. డైరెక్టర్
(అడ్మినిస్ట్రేషన్) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ మహనీయుల
త్యాగఫలంతో స్వాతంత్య్రం సాధించిన తరువాత మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి
సాధించిందని పేర్కొన్నారు. సాధించిన దానికి సంతృప్తి చెంది అదే విజయమనుకుంటే
పొరపాటని ఒక కవి చెప్పినట్లు అక్కడితో ఆగకుండా అభివృద్ధి సాధించాలని
పేర్కొన్నారు. మన ఏపీఎస్ ఆర్ టిసి. దినదినాభివృద్ధి సాధించి ప్రయాణీకుల ఆదరణ
పొందడమే కాకుండా ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. టిక్కెట్
ఆదాయంతో పాటు కార్గో, కమర్షియల్ ఆదాయం పెంచుకోవడం, కొన్ని పుణ్యక్షేత్రాలకు
బస్సులు ప్రత్యేకంగా నడిపి ఆదాయంతో పాటు ఆదరణ కూడా సంపాదించామని పేర్కొన్నారు.
కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, హాస్పిటల్, డిస్పెన్సరీలలో
సదుపాయాల ఏర్పాటు, ఇలా ఎప్పటికప్పుడు అన్ని విధాలా ఆర్టీసీలో మార్పులు
చేసుకుంటూ ముందుకెళ్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఉద్యోగులు అందరూ
సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అనంతరం ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మనం77 వ స్వాతంత్య్ర
దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మోహన్ దాస్
కరంచంద్ గాంధీ (మహాత్మాగాంధీ), , జవహర్ లాల్ నెహ్రూ, బాల గంగాధర్ తిలక్,
పింగళి వెంకయ్య, భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్, సరోజినీ దేవి, ఝాన్సీ
లక్ష్మీ భాయ్ , అల్లూరి సీతా రామరాజు, డా. బి ఆర్. అంబేద్కర్ లాంటి ఎందరో
మహానుభావుల పోరాట పటిమతో ఈ రోజు మన దేశం బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటిష్
ప్రభుత్వాన్ని ఎదిరించి స్వాతంత్య్రం సాధించినదని, అనంతరం ఎన్నో రంగాల్లో
అభివృద్ధి సాధించి పేరు ప్రఖ్యాతలు పొందినదన్నారు. ఈ క్రమంలో రవాణా రంగంలో
కూడా ప్రజలకు సేవలందిస్తూ ప్రగతి పధంలో దూసుకెళ్తోందని అన్నారు. మన ఏ. పి.
ఎస్. ఆర్. టి. సి. బస్సులు ప్రతి రోజు సుమారు 40 లక్షల కిలోమీటర్లు
ప్రయాణించిసుమారు 33 లక్షల మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్నాయని
వివరించారు. ప్రజల ఆదరాభిమానాలతో అన్ని రూట్లలో పల్లె వెలుగు బస్సులు, పట్టణాల
మధ్య ఎక్స్ ప్రెస్ బస్సులు, సుదూర ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతూ
ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ అందిస్తున్న సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ఎంతో మేలు చేశారని, ఆ
కారణంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ జీతాలు పొందుతున్నారన్నారు. ఇప్పుడు
ఇదే బాటలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం
చేయాలని భావిస్తోందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు
ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ అనుమతితో ఇటీవల కారుణ్య నియామకాల భర్తీ జరిగి
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల పిల్లలు, మన సంస్థలో ఉద్యోగంలో పొందడం
ఆనందంగా ఉందని, వారంతా కూడా క్రమశిక్షణతో డ్యూటీ చేసి సంస్థ ప్రగతిలో
భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీ ఎఫ్ హయ్యర్
పెన్షన్ రావడంలో కూడా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకోవడం వలన దేశంలోనే
మొట్టమొదటి సారిగా ఏ ఇతర ఆర్టీసీలలో లేని విధంగా 5 రేట్లు ఎక్కువ పెన్షన్ మన
ఉద్యోగులు పొందడం సంతోషదాయకమని వివరించారు. టిక్కెట్టేతర ఆదాయం పెంచుకునే
క్రమంలోకార్గో డోర్ టు డోర్ సేవలు అంతటా విస్తరించడం కూడా జరిగిందని , అతి
తక్కువ సమయంలో డెలివరీ అందించే సంస్థగా మన ఏ.పి.ఎస్.ఆర్.టి.సి పేరుసాధించడం మన
ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి వై. ఎస్.
జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యుత్ బస్సులు ప్రారంభమై, సమర్ధవంతంగా
తిరుమల తిరుపతి రూట్లలో నడపబడుతున్నవని, అంతేకాకుండా 1500 కొత్త డీజిల్
బస్సులుపాత బస్సుల స్థానంలో త్వరలో రానున్నట్లు తెలిపారు. అలాగే మారుతున్న
టెక్నాలజీ అందిపుచ్చుకుని ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన యుటీఎస్ ద్వారా
డిజిటల్ పేమెంట్స్ కూడా విజయవంతంగా అమలు చేయబడుతూ, ప్రయాణికుల మన్ననలు
పొందామని పేర్కొన్నారు. అలాగే ఇటీవల టెంపుల్ టూరిజం అమలు చేసి ప్రముఖ పుణ్య
క్షేత్రాలకు బస్సులు నడపడం ద్వారా ఆదాయం పెంచుకోవడం జరిగిందని, దీనికి కృషి
చేసిన సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఎంతో
ప్రగతి సాధించామని, ఇదే స్పూర్తితో నష్టాలను పూడ్చుకొని ఆర్టీసీని లాభాల్లోకి
తీసుకువచ్చేలా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు కలిసికట్టుగా శ్రమించి కృషి
చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంస్థలో వివిధ విభాగాలలో ప్రతిభ
కనబరిచిన 19 మంది ఉద్యోగులకు, సూపర్వైజర్లకు , సిబ్బందికి, ఛైర్మన్
మల్లికార్జున రెడ్డి, ఎం.డి ద్వారకా తిరుమల రావు కలిసి క్యాష్ అవార్డు ,
ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ వేడుకలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
(అడ్మినిస్ట్రేషన్) ) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి , ఇ.డి (ఆపరేషన్స్) ఏ.
కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి.కృష్ణ మోహన్, ఎఫ్.
ఏ. & సి. ఏ. ఓ రాఘవ రెడ్డి, ఓ. ఎస్. డి.(సి &ఎల్.) జి. వి. రవి వర్మ, ఇ.డి
విజయవాడ జోన్) గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.