నేడు పట్టణంలో శకటాల ప్రదర్శన
విజయనగరం : స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలకు జిల్లా
ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు ముఖ్య అతిధిగా హాజరై, జాతీయ
పతాకావిష్కరణ చేయనున్నారు. ఈవేడుకలను నిర్వహించే పెరేడ్ గ్రౌండ్‌ను
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం సాయంత్రం పరిశీలించారు. వేదికను,
మైదానాన్ని, స్టాల్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా పంచాయితీ,
గ్రామీణాభివృద్ది సంస్థ, మత్స్యశాఖ, ఉద్యాన శాఖ, సర్వే మరియు భూ
రికార్డుల శాఖ, చేనేత జౌళిశాఖ, జిల్లా నైపుణ్యాభివృద్ది శాఖ,
వైద్యారోగ్యశాఖ, వైద్యారోగ్యశాఖ, పశు సంవర్థకశాఖ, సాంఘిక
సంక్షేమశాఖ, మహిళాభివృద్ది శిశు సంక్షేమశాఖ, సెట్విజ్, విభిన్న
ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు
చేస్తున్నట్లు తెలిపారు. శకటాలను వాటికి కేటాయించిన నంబర్ల ప్రకారం
నడిపించాలని, అత్యుత్తమంగా ఉన్న వాటికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని
సూచించారు. పెరేడ్ గ్రౌండ్లో వేడుకల అనంతరం శకటాలను ప్రజల
సందర్శనార్ధం, విజయనగరం పట్టణంలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి మయూరి
జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు.
వర్షం పడితే మైదానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో
చర్చించారు. వచ్చిన అతిధులతోపాటుగా సామాన్య ప్రజలకు కూడా కూర్చోవడానికి
కుర్చీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యవసాయ,
ఉద్యాన, జౌళి, పట్టుపరిశ్రమ శాఖలు సంయుక్తంగా, గ్రామీణాభివృద్దిశాఖ,
నీటి యాజమాన్య సంస్థ, విద్యాశాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ, ఎపిఎంఎస్ఐడిసి,
గ్రామీణ నీటిసరఫరా, గృహనిర్మాణశాఖ ఆర్డిఓ విజయనగరం, మహిళా శిశు
సంక్షేమశాఖ, అటవీశాఖ, విద్యుత్, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా
పోలీసు, అగ్నిమాపక శాఖలు శకటాల ప్రదర్శన నిర్వహిస్తాయని
కలెక్టర్‌కు తెలిపారు. జిల్లా ఎస్పి దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్
మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ
ఎం.గణపతిరావు, ఆర్డిఓ ఎంవి సూర్యకళ, ఎస్డిసిలు బి.సుదర్శనదొర,
డి.వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములనాయుడు, తాశిల్దార్
కోరాడ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది
పాల్గొన్నారు.