యమునా నదిలో నురగను అణిచివేసేందుకు ‘విషపూరితమైన’ రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పడం సరికాదని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) వైస్ చైర్మన్ సౌరభ్ భరద్వాజ్ గురువారం పేర్కొన్నారు. భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించే ఛత్ పూజకు ముందు యమునా నది నుంచి నురుగును తొలగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం విషపూరిత రసాయనాన్ని స్ప్రే చేసిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. డీజేబీ ఆధ్వర్యంలో జరుగుతున్న యమునా-క్లీనింగ్ కసరత్తుపై భారతీయ జనతా పార్టీ నిందలు వేయడం సరికాదన్నారు. “బీజేపీ నాయకులు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కొంత నేర్చుకోవాలి. యాంటీ-ఫోమింగ్ కెమికల్ టెక్నాలజీని కేంద్రం, ఎన్ఎం.జి.సీ. కూడా సిఫార్సు చేసింది” అని భరద్వాజ్ అన్నారు. ఛత్ భక్తులు సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసేందుకు వీలుగా యమునా నదిలో నురగలను తగ్గించేందుకు డీజేబీ ఒక నెల రోజుల క్రితమే సన్నాహాలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.