విపక్షాలలో ఇప్పటికీ కాంగ్రెస్‌దే పెద్ద పీటా!
కేజ్రీ, నితీష్, లాలూ ఆలోచనేంటీ?
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ
కూటమి కట్టాయి. బెంగుళూరు వేదికగా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి.
ప్రత్యామ్నయం తామేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. ఇండియా పేరుతో
కూటమి కట్టి ఐక్యతా రాగం చాటుతున్నా ఎవరి ఎజెండా వారిదే.*
బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26
పార్టీలు హాజరయ్యాయి. కూటమికి ఇండియా అనే పేరు పెట్టి ప్రతిపక్షాల ఐక్యతే
ప్రధానం అంటూ ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతానికి సీట్ల పంపకాలు, పొత్తులపై
స్పష్టత రాకున్నా తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రతిపక్షాలు
ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌కు కొన్ని
రాజకీయపక్షాలు హాజరవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . అసలు
అంతరించిపోతుందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో మీటింగ్ పెట్టడం ఆ పార్టీ
వ్యూహకర్తల సక్సెస్ అని ఒప్పుకోవాల్సిందే. ప్రాంతీయ పార్టీల ఆశలు వారి
ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు
వేసింది. ఇటీవల హిమాచల్, కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్
పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే
ఎవరికి కావాల్సింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది. ఇక
ఎప్పటినుంచో ప్రధాని కావాలనుకుంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్
కూటమికి ముందు నుంచి సిద్ధంగానే ఉన్నారు. ఆయన బీహార్ రాజధాని పాట్నాలో
ప్రతిపక్షాల తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అవసరమైతే మేము నాయకత్వ
బాధ్యతలు వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ సిగ్నల్
ఇచ్చింది. దీంతో ఇక తానే ప్రధాని అభ్యర్ధి అని నితీష్ నిర్ధారించుకున్నారు.
నితీష్‌ను కేంద్రానికి పంపి తన కొడుకు తేజస్విని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న
లాలుకు పూర్తి అనుకూలమైన పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధిగా
నితీష్‌ను ప్రొజెక్ట్ చేయడాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితిలేదు. అయినా
తాత్కాలికంగా నితీష్‌ను ఊహల్లో ఉంచాలనేది కాంగ్రెస్-లాలు ఆలోచన. అందుకే
బీహార్‌లో బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు కూటమిగా ఒక్కతాటిపైకి వచ్చాయి.