ప్యాంగ్యాంగ్ : ఓ అమెరికా జాతీయుడు దక్షిణ కొరియా భూభాగం నుంచి ఎలాంటి
అనుమతులు లేకుండా కిమ్ జోంగ్ ఉన్ సామ్రాజ్యం ఉత్తర కొరియాలోకి
అడుగుపెట్టాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తమ దేశ
భూభాగంలోకి అడుగుపెట్టిన ఓ అమెరికా దేశస్థుడిని ఉత్తర కొరియా అధికారులు
కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఎలాంటి అనుమతులు లేకుండా దక్షిణ కొరియా నుంచి
ఉత్తర కొరియాసైనిక సరిహద్దును దాటే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తి
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్యనున్న సంయుక్త భద్రతా ప్రాంత సందర్శనకు
వచ్చినట్లు తెలిసింది. ఇది సైనిక రహిత ప్రాంతం. అందుకే ఎక్కువ మంది పర్యాటకులు
సందర్శనకు వెళ్తుంటారు. ‘కొరియాలో సంయుక్త భద్రతా ప్రాంత సందర్శనకు వెళ్లిన ఓ
అమెరికన్ ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటాడు. ఆ సైనిక సరిహద్దు రేఖ
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే) పరిధిలో ఉంది.
సరిహద్దు దాటి వెళ్లిన వ్యక్తి డీపీఆర్కే కస్టడీలో ఉన్నట్లు భావిస్తున్నాం.
కొరియన్ పీపుల్స్ ఆర్మీతో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని’ యునైటెడ్
నేషన్స్ కమాండ్ ట్వీట్ చేసింది.
యునైటెడ్ నేషన్స్ కమాండ్ ట్వీట్లో ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు సరిహద్దు దాటాడనే
విషయాలను ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యక్తి అమెరికా ఆర్మీకి చెందిన సైనికుడని
దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించినట్లు ఓ కొరియన్ పత్రిక పేర్కొంది. యునైటెడ్
నేషన్స్ కమాండ్ ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, 1950-53 కొరియా
యుద్ధం ముగిసిన తరువాత నుంచి దాదాపు 30 వేల మంది ఉత్తర కొరియా పౌరులు దక్షిణ
కొరియాలోకి ప్రవేశించారు. నియంతలుగా పేరొందిన కిమ్ వంశస్థుల పాలనలో రాజకీయ
అణచివేత, ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో వారు దేశం విడిచారు. అయితే దక్షిణ
కొరియన్లు, అమెరికన్లు అక్రమంగా ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన సందర్భాలు చాలా
అరుదు.