ప్రవేశ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 16 నుండి తరగతులు
విజయవాడ : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపి సెట్ 2023
షేడ్యూలును సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి
మంగళవారం విడుదల చేసారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్దులు జులై 24
నుండి ఆగస్టు 3వ తేదీ లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియను
పూర్తి చేయవలసి ఉంటుంది. జులై 25వ తేదీ నుండి ఆగస్టు 4 వరకు సహాయ కేంద్రాల
వద్ద ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఆగష్టు మూడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ
వరకు ఐదు రోజుల పాటు అభ్యర్దులు తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు అవకాశం
ఉంటుంది. ఆప్షన్ల మార్పు కోసం ఆగస్టు 9వ తేదీన ఒక రోజు మాత్రమే అవకాశం
ఉంటుందని, ఆగస్టు 12వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతామని నాగరాణి
పేర్కొన్నారు. విధ్యార్ధులు 13, 14 తేదీలలో వ్యక్తిగతంగా సీట్లు పొందిన
కళాశాలల్లో రిపోర్టు చేయాలని, ఆగస్టు 16వ తేదీ నుండి తరగతులు ప్రారంభం
అవుతాయని వివరించారు. పూర్తి వివరాలు, సహాయ కేంద్రాల సమాచారం కోసం
cets.apsche.ap,gov.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.