పారదర్శకంగా అందుతున్న పథకాలు
జగన్ పాలనలో ప్రతికుటుంబానికీ లబ్ది
పవన్, చంద్రబాబుల ప్రేలాపనలకు చెక్ పెట్టండి
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్
సారవకోట : అందరికీ సంక్షేమం అందాలన్నదే జగనన్న సురక్ష లక్ష్యమని మాజీ డిప్యూటీ
సీఎం, వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం
సారవకోట మండలంలోని కేలవలస, మాలువా పంచాయతీలలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను
ప్రారంభించారు. రూ.30 లక్షల (రూ.20 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రూ.10 లక్షల
పంచాయతీ నిధులు) నిర్మించిన సిసి రహదారిని, అక్కడే నిర్మించిన బస్సు షెల్టర్
కూడా ప్రారంభించారు. రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని
ప్రారంభించారు. తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమంలలో పాల్గొన్నారు. ఈ
సందర్భాల్లో ఆయన మాట్ళాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటంలో మధ్యవర్తులు,
దళారులు ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలందరికీ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి
వైయస్ జగన్ మోహన్ రెడ్డిదే అని తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా
ప్రభుత్వ పథకాలు నగదు తమ ఖాతాలలోకే పడుతున్నాయని మహిళలు ప్రభుత్వ పాలన పట్ల
హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ , మతం, కులం
చూడకుండా అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ప్రతి
కుటుంబానికి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి కలుగుతోందని, ఈ సంక్షేమ
పథకాలు మరింత మెరుగ్గా అమలు జరగాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ని సీఎం గా
ఉండాల్సిందేనని కృష్ణదాస్ స్పష్టం చేశారు. జగన్ అందిస్తున్న సుపరిపాలన ఎంతగానో
ప్రజాభిమానాన్ని పొందిందన్నారు. ఇక తమకు అడ్రస్ ఉండదని గ్రహించిన పవన్,
చంద్రబాబులు రకరకాల ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై
జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని చూసినా.. ప్రజలంతా ఏకతాటిపై మళ్ళీ సీఎం గా జగన్
ను అధికార పీఠంపై నిలిపేందుకు సిద్ధంగా ఉన్నారని కృష్ణదాస్ వివరించారు.
కార్యక్రమంలో వరుదు వంశీకృష్ణ, నక్క రామరాజు, నక్క తులసీదాస్, యాల్ల శ్యామ్,
తేజ మాస్టారు, రావాడ శ్రీను, పల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.