తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం!
రష్యా-ఉక్రెయిన్ల మధ్య 500 రోజులుగా యుద్ధం నడుస్తున్నా ఐరోపా, ఆఫ్రికా,
ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో చాలామంది ప్రజల నోటిలోకి రోజూ కాసింత ముద్ద
పోతోందంటే, ఆ దేశాలకు తిండి గింజలు దొరుకుతున్నాయంటే కారణం నల్ల సముద్ర ధాన్య
ఒప్పందం(బ్లాక్‌సీ గ్రెయిన్ డీల్)! దీన్నుంచి రష్యా అనూహ్యంగా దూరమవ్వాలని
నిర్ణయించడం ఆందోళనకు గురిచేసే పరిణామమే. ప్రపంచ ధాన్య ఎగుమతుల్లో నాలుగోవంతు
రష్యా, ఉక్రెయిన్ల నుంచే జరుగుతాయి. గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె,
తదితర ఆహార ఉత్పత్తులను ప్రపంచంలో అత్యధికంగా పండించేవి ఈ రెండు దేశాలే.
ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆసియా, ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో రోజువారీ తిండికి ఇవే
ఆధారం. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న అవసరాలను ఉక్రెయినే తీరుస్తుంది. అందుకే
ఉక్రెయిన్ను ప్రపంచ బ్రెడ్ బాస్కెట్ అని కూడా అంటుంటారు. అలాగే వ్యవసాయం
ఇతర ఇంధన అవసరాలకు అవసరమైన ఎరువులను రష్యా తీరుస్తుంది. అలా ఈ రెండుదేశాలపై
ప్రపంచంలోని అనేక దేశాల వ్యవసాయం, ఆహార భద్రత ఆధారపడి ఉంది. 2022 తొలినాళ్లలో
యుద్ధం ఆరంభం కాగానే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఆహారోత్పత్తుల
సరఫరానే కాకుండా ఆహార భద్రత ప్రమాదంలో పడింది. భారత్ సహా అనేక దేశాల్లో ధరలు
పెరగటానికి కారణం ఇదే. ధరల పెరుగుదలే కాకుండా… యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి
అనేక దేశాలకు ఎగుమతులు ఆగిపోయి ఆహారకొరత ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. 38
దేశాల్లో 4 కోట్ల మందికిపైగా ఆకలితో అలమటిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన
వ్యక్తంజేసింది. అందుకే ఐక్యరాజ్యసమితి ఆగమేఘాలపై రంగంలోకి దిగింది. తుర్కియే
సాయంతో రష్యా-ఉక్రెయిన్ల మధ్య 2022 జులై 22న ఒప్పందం కుదిర్చారు. ప్రపంచం
ఊపిరిపీల్చుకుంది. ఒప్పందం తర్వాత ఇప్పటిదాకా దాదాపు 3 కోట్ల టన్నులకుపైగా
ఆహారధాన్యాలను ఉక్రెయిన్ నుంచి ఎగుమతి చేశారు. ప్రపంచ ఆహార
కార్యక్రమాని(డబ్ల్యూఎఫ్‌పీ)కి ఇదే రెండో అతిపెద్ద సరఫరాదారైంది.
ఒప్పందంలో ఏముంది? : ఒప్పందం ప్రకారం నల్లసముద్రంలోని రేవుల ద్వారా
ఉక్రెయిన్ ఆహార ధాన్యాల ఎగుమతులకు రష్యా అనుమతిస్తుంది. ఉక్రెయిన్‌లోని మూడు
పోర్టుల నుంచి వచ్చే, వెళ్లే నౌకలను రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి,
తుర్కియే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. వాటిలో ఆయుధాలేమీ సరఫరా
కాకుండా ఉండటానికే ఈ తనిఖీలు. ప్రతి నాలుగునెలలకోసారి ఈ ఒప్పందాన్ని
పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇది సోమవారంతో (జులై 17 తేదీ) ముగిసింది. ఈసారి
ఒప్పందాన్ని కొనసాగించబోమని, దాన్నుంచి విరమించుకుంటున్నట్లు రష్యా
ప్రకటించింది. అంటే ఉక్రెయిన్ నుంచి నల్ల సముద్రం ద్వారా ధాన్యం ఎగుమతి
కష్టమవుతుంది. ఈ ఒప్పందం వల్ల తమకు ఎలాంటి లాభం లేదన్నది రష్యా వాదన.
ఒప్పందంలో పేర్కొన్నట్లు తమ ధాన్యం, ఎరువుల ఎగుమతులకు అడ్డంకులను
తొలగించట్లేదని రష్యా ఆరోపిస్తోంది. మర్యాదపూర్వకంగా ఒప్పందాన్ని పొడిగిస్తూ
వస్తున్నాం. కానీ పాశ్చాత్య దేశాలు మాకిచ్చిన మాటను నిలబెట్టుకోవటం లేదు. ఇక
చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు.
*రష్యా డిమాండ్లు ఇవీ : ధాన్యంతో పాటు ఎరువులనూ ఎగుమతి చేయటానికి అవకాశం ఉందని
ఒప్పందంలో ఉంది. దాన్ని అమలు చేయాలి. రష్యా ఎరువుల ఎగుమతికి, వాటి బ్యాంకింగ్
లావాదేవీలకు పాశ్చాత్య దేశాలు అనుమతించాలి. అంతర్జాతీయ బ్యాంకింగ్ స్విఫ్ట్
వ్యవస్థలోకి రష్యా వ్యవసాయ బ్యాంకును అనుమతించాలి. లావాదేవీలు చేసుకునే వీలు
కల్పించాలి. (యుద్ధానంతరం ఆంక్షల్లో భాగంగా రష్యాను, రష్యా కంపెనీలను,
సంపన్నులను ఈ స్విఫ్ట్ వ్యవస్థలో పాల్గొనకుండా నిషేధం విధించారు. వారి
అకౌంట్లను స్తంభింపజేశారు.)
రష్యా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ షిప్పింగ్,
బీమా, సరఫరా, లావాదేవీలపై ఆంక్షలు ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి. వాటిని
సడలించాలన్నది రష్యా డిమాండ్.*
ఒప్పందం లేకుంటే ఏమౌతుంది? : నల్లసముద్ర ధాన్య ఒప్పందాన్ని పునరుద్ధరించకుంటే
ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుంది. 79 దేశాల్లోని 35 కోట్ల మంది ప్రజలకు
ఈ ఒప్పందమే జీవనాధారం. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగి
ఆర్థికవ్యవస్థలు, ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంది. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత
ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్నది ఐరాస ఆందోళన. ముఖ్యంగా పేదదేశాల్లో
ఆకలి కేకలు వినిపిస్తాయి. చావులు కనిపిస్తాయి. ఎగుమతులపైనే ఆధారపడ్డ
ఉక్రెయిన్ కూడా ఆర్థికంగా ప్రభావితమవుతుంది.