ఆస్ట్రేలియా : పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్హెడ్ తీరం వద్ద ఒక అంతుచిక్కని
వస్తువు కలకలం సృష్టిస్తోంది. దాని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
హల్చల్ చేస్తున్నాయి. అది చంద్రయాన్-3ని మోసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం4
రాకెట్‌కు సంబంధించిన భాగమై ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నేల
నుంచి దూసుకెళ్లే సమయంలో ఆ వాహకనౌక ఆస్ట్రేలియా గగనతలం గుండానే వెళ్లింది.
తాజాగా కనిపించిన శకలం భారత్ గతంలో ప్రయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్ భాగమై
ఉండొచ్చని మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అది ఏంటన్నది ఆస్ట్రేలియా
అంతరిక్ష సంస్థ ధ్రువీకరించలేదు. విదేశీ అంతరిక్ష సంస్థకు సంబంధించిన భాగమై
ఉండొచ్చని మాత్రమే పేర్కొంది. ఈ అంశంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
స్పందించలేదు. తాజాగా కనిపించిన శకలం పొడవు 2 మీటర్లుగా ఉంది. అది రాకెట్‌కు
సంబంధించిన మూడో దశ శకలమై ఉంటుందని ఎక్కువమంది చెబుతున్నారు. అంతరిక్ష
వాహకనౌకల్లో బూస్టర్లు, దశలు ఉంటాయి. ప్రజ్వలన ముగిసిపోగానే అవి రాకెట్ నుంచి
విడిపోయి సముద్రంలో పడిపోతుంటాయి.