పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతోంది. దాంతో అమెరికా ,
యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి
చేస్తున్నాయి. ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణ సూచికపై ఆదివారం
రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కనిపించింది. అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న
తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు
కోలిన్ మెక్ కార్తీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ విమానాశ్రయంలో
మధ్యాహ్నం 12.30 సమయంలో ఉష్ణ సూచిక 66.7 డిగ్రీల సెల్సియస్ చూపించిందని ఆయన
ట్విటర్లో తెలిపారు. ఈ తాపాన్ని మానవులు, జంతుజాలం భరించలేవని చెప్పారు.
వాతావరణం ఎంత వేడిగా ఉంది. ఎంత చల్లగా ఉందనే విషయాన్ని లెక్కించేందుకు
శాస్త్రవేత్తలు గాలిలో ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి
తీసుకుంటారు. ఆ పద్ధతుల్లో ఉష్ణ సూచిక ఒకటి. ఈ విధానంలో గాలి ఉష్ణోగ్రత, తేమ
ఆధారంగా ఉష్ణోగ్రతను అంచనా వేస్తారు. పర్షియన్ గల్ఫ్‌లోని చాలా వెచ్చని
నీటిపై ప్రవహించే తేమతో కూడిన గాలి లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో
ఇరాన్లో భయంకర ఉష్ణోగ్రత వెలుగు చూసింది.
రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్న కిల్లర్ డ్రోన్లు : ఇలాంటి వేడి మానవులపై
తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. తగినంత నీరు
తీసుకోకపోతే చెమట, మూత్రం రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళ్లి డీ హైడ్రేషన్‌కు
గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. రక్తం చిక్కబడి.. అది గడ్డకట్టే
స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. దాంతో గుండెపోటు, పక్షవాతం కూడా రావొచ్చని
వెల్లడించారు. అప్పటికే అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు ఈ వాతావరణం మరింత
ప్రమాకరమని హెచ్చరించారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో
తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా, యూరప్, ఆసియాలోని కొన్ని
ప్రాంతాలను వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్లోరిడాలో అట్లాంటిక్
జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకాయి. చైనాలోని శాన్‌బో
టౌన్‌షిప్‌లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ
నేపథ్యంలో తక్షణమే భూగోళం వేడిని నియంత్రించే చర్యలు తీసుకోకపోతే అది మానవులకు
ఓ నరకంగా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.