విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు
ఉపసంహరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యోగివేమన
విశ్వవిద్యాలయ విద్యార్ధులపై రాష్ట్ర ప్రభుత్వం పునర్విచారణకు పిటిషన్ వేసి
శిక్షలు పడేలా చేయడం విద్యార్ధులపై కక్ష సాధించడమే. రాష్ట్ర ప్రభుత్వ చర్యను
సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
చెప్పారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని,
విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు,
ప్రజాసంఘాలు, మేధావుల వేదికలు వివిధ రూపాలలో తమ నిరసనను తెలియజేశాయి. అందులో
భాగంగా 2016 ఆగస్టు 8న సిఎం సొంత జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో
విద్యార్ధులతో సమావేశం నిర్వహించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అప్పటి
టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ విద్యార్ధి నాయకులపై పొద్దుటూరు
పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు విచారణ సరిగ్గా చేయలేదని
సాక్ష్యాలను, పక్కాగా పెట్టలేదని పునర్విచారణ చేయడం కోసం జగన్మోహనరెడ్డి
ప్రభుత్వం సిఆర్పిసి సెక్షన్ 242 క్లాజ్ 2 ప్రకారం కేసును బలంగా ఉండడం కోసం
మరిన్ని ఆధారాలను చేరుస్తూ పిటిషన్ వేసిందని, సెక్షన్ 311 క్రింద సాక్షులను
మళ్ళీ కోర్టుకు పిలిపించి విద్యార్ధి నాయకులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు
ప్రవేశపెట్టడమంటే ప్రత్యేక హోదా పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో
అర్ధమవుతోందన్నారు.
ఎన్నికలలో గెలవడానికి వైఎస్సార్ సిపి కూడా ప్రత్యేక హోదాను సాధనంగా
వాడుకుందని, అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని
పక్కన పెట్టి కేంద్రానికి దాసోహం అయ్యింది చాలక తన స్వార్ధ ప్రయోజనాల కోసం
విద్యార్ధి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై సమావేశం నిర్వహించిన విద్యార్ధి నాయకులపై క్రిమినల్
ప్రొసీజర్ 242, 311 సెక్షన్లతో పిటిషన్ వేయడం, విచారణ జరిగిపోయిన కేసును
తిరగదోడి పునర్విచారణ చేసి శిక్షలు పడేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ
పోకడలకు నిదర్శనం. ప్రజాసమస్యలపై పోరాడే వారిపై క్రిమినల్ చట్టాలను
ప్రయోగించడం అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టడానికి
తెచ్చిన జివో నెం.1 విషయంలో కోర్టునుండి ఎదురుదెబ్బ తగిలిన తరువాత కూడా వైసిపి
ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదని, ప్రజాఉద్యమాలను ఎంత అణచాలని చూస్తే
అంత వేగంగా పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, రాజకీయ పార్టీలు,
మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ వైఖరిని ఖండించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర
కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు.