గహ్లోత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆరోపణ
జైపుర్ : ప్రతిపక్షాలన్నీ తమ కుటుంబ రాజకీయాలను రక్షించుకునేందుకు కూటమి
కట్టే యత్నాల్లో ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అంటే ‘ఉత్పీడన్(అణచివేత), పక్షపాత్(ఆశ్రిత
పక్షపాతం), అత్యాచార్(దౌర్జన్యాలు) అని అభివర్ణించారు. ప్రతిపాదిత కూటమి
‘దేశభక్త ప్రజాస్వామ్య కూటమి’ కాదని ‘వంశపాలన రక్షణ కూటమి’ అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అంటే ‘తల్లి-కుమారుడు-కుమార్తె’ పార్టీ అని ఆక్షేపించారు. ఈ ఏడాది
చివరలో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ జేపీ నడ్డా జైపుర్లో
జరిగిన ఓ ర్యాలీలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ ప్రజల్ని
దోచుకుంటూ వారిపై హింసాకాండకు పాల్పడుతున్న అశోక్ గహ్లోత్ సర్కార్కు ఒక్క
నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్
సారథ్యంలోని యూపీఏపై విమర్శలు గుప్పించిన నడ్డా.. మరోసారి కాంగ్రెస్కు
అధికారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ
సారథ్యంలోని ఎన్డీయే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్,
సబ్యా ప్రయాస్ అనే మంత్రంతో పనిచేస్తోందని కొనియాడారు. రాజస్థాన్లో
మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఉదయ్పుర్లో దర్జీ కన్నయ్యలాల్
హత్యోదంతం, వంటి ఘటనలపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల చిట్టాను
విడుదల చేశారు. దళితులు, గిరిజనులు, మహిళలు, చిన్నారులు, పేదలపై అరాచకాలు
సృష్టించడంలో కాంగ్రెస్ రికార్డులను బ్రేక్ చేసిందంటూ ఎద్దేవా చేశారు.
అవినీతిని ప్రోత్సహించడం, అవినీతిలో కొత్త రికార్డులు సృష్టించడం
రాజస్థాన్లోని అశోక్ గహ్లోత్ సర్కార్ లక్షణమన్నారు. రాష్ట్రంలోని
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకిస్థాన్ నుంచి వచ్చిన
శరణార్థుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తోందని ఆరోపించారు.