నైరోబి : కెన్యాలో తలదాచుకుంటున్న పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్(50) పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. పిల్లల అపహరణలో ప్రమేయం ఉన్న కారును పోలి ఉండడంతో పాటు.. రోడ్డు బ్లాక్ చేసినప్పటికీ ఆపకుండా వేగంగా వెళ్లడంతో కాల్పులు జరిపినట్లు నైరోబి పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్ల చింతిస్తున్నామని, కారును గుర్తించడంలో తప్పిదం వల్లే కాల్పులు చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనపై పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను కోరే అర్షద్.. పాక్ ఆర్మీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌పై ఇటీవల విమర్శలు చేశారు. అరెస్టు చేస్తారన్న భయంతో పాకిస్థాన్‌ను విడిచి గత కొన్ని నెలలుగా కెన్యాలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన సోదరుడు ఖుర్రం అహ్మద్‌తో కలిసి మగది నుంచి నైరోబికి ఆయన కారులో వెళుతున్నారు. అహ్మద్ కారు నడుపుతుండగా షరీఫ్ పక్కనే కూర్చున్నారు. కెన్యా రాజధాని నైరోబి శివారులో పోలీసులు అడ్డంగా చిన్నచిన్న రాళ్లతో రోడ్డును మూసివేశారు. ఈ క్రమంలో కారును ఆపకుండా ఒక్కసారిగా వేగంగా పోనివ్వడంతో కాల్పులు జరిపినట్లు నైరోబి పోలీసులు తెలిపారు.
పోలీసుల సూచనలు పట్టించుకోకపోవడంతోనే కారులో ఉన్న వ్యక్తులను అనుమానించి కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో కారు పల్టీలు కొట్టగా, ఒక బుల్లెట్ షరీఫ్ తలలోకి దూసుకెళ్లింది. అతడి సోదరుడు గాయపడ్డాడు. ఈ కాల్పుల ఘటన పట్ల కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ మాట్లాడారని, కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరినట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో పాక్ జాతీయ సంస్థలు, మిలిటరీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అరెస్టు భయంతో గత జులై నుంచి షరీఫ్ పాక్‌ను విడిచి వేరే దేశంలో తలదాచుకుంటున్నాడు. షరీఫ్ మృతి పట్ల పాక్ ప్రధాని, అధ్యక్షుడు, మిలిటరీ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు షరీఫ్‌పై కాల్పులకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. షరీఫ్‌కు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కెన్యా పోలీసులు చెబుతున్న విషయాలను నమ్మడం లేదని ఓ సీనియర్ జర్నలిస్టు అన్నారు. కెన్యా పోలీసుల వాంగ్మూలంలో వైరుధ్యాలు ఉన్నాయని, స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.