అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన (సిత్రంగ్ తుఫాను) అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ అల్పపీడన ద్రోణి తుఫానుగా బలపడి అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపింది. ఐఎండీ పేర్కొన్న వివరాల ప్రకారం.. అండమాన్ సముద్రం మీద అల్పపీడన ద్రోణి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబరు 23న అల్పపీడనంగా ఆపై తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 24 నాటికి ఈ వ్యవస్థ ఉత్తరం వైపు తిరిగి పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిత్రంగ్ తుఫాను కోల్‌కతాను దాటి బంగ్లాదేశ్‌కు వెళ్లనుందని సమాచారం.
బంగాళాఖాతంలో ఈ తుఫాను తీవ్రతరం కావచ్చని అంచనా వేస్తున్నట్టు వాతావరణ కార్యాలయం తెలిపింది. కోల్‌కతాలో దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. సోమవారం వర్షాలు కురుస్తాయని, అయితే అంచనా ప్రకారం వర్షం, గాలుల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను సోమవారం తెల్లవారుజాము వరకు వాయువ్య దిశగా కదులుతుంది. మొదట ఉత్తరం వైపు, తరువాత ఈశాన్య దిశగా కదులుతుంది. ఈ వ్యవస్థ తీవ్ర తుఫానుగా మారుతుందని భావిస్తున్నప్పటికీ, అది బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని కోల్‌కతాలోని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జి.కె. దాస్ తెలిపారు. “తుఫాను అంచనా వేసిన మార్గానికి కట్టుబడి ఉంటే, కోల్‌కతాలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, దానితో పాటు అప్పుడప్పుడు గాలులు వీచే అవకాశం ఉంది.” అని తెలిపారు.
మూలం: టెలిగ్రాఫ్