ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుదుత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది.
రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ లో శీతాకాలం, వేసవి కాలంలో విద్యుత్ కోతలను సృష్టించడానికే విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖేర్సన్ ప్రాంతంలోని కఖోవ్కా జలవిద్యుత్ కేంద్రాన్ని నాశనం చేయడానికి రష్యా ప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు.
మూలం: ఫ్రాన్స్24