భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.07 గంటలకు జీఎస్ఎల్వీ-మార్క్ 3 (నినే ఎల్వీఎం3-ఎం2) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్‌వెబ్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని.. అందులో భాగంగానే ఇప్పుడు 36 ఉపగ్రహాలను పంపించామని తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని చెప్పారు.
మూమూలం: ఎన్.డి.టి.వి.