లండన్: లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని కోసం అభ్యర్థుల ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవారం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా ట్రస్ కొనసాగనున్న తరుణంలో.. ఈ మధ్యలోనే కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే.. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పటికే వంద మంది టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికే ఆయన ఆ మద్దతును దాటేశారని, తద్వారా ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మొదటి వ్యక్తిగా నిలిచారని స్థానిక మీడియా ప్రకటించింది. ఇక మాజీ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ సైతం రిషి సునాక్‌కు తన మద్దతు ప్రకటించారు. మరో టోరీ ఎంపీ నైగెల్ మిల్స్.. గతంలో ట్రస్‌ను ఎన్నుకుని తప్పు చేశానని, ఈసారి ఆ తప్పు మరోసారి చేయదల్చుకోలేదంటూ రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించారు.
ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన 42 ఏళ్ల సునాక్‌కు ఈసారి ఎక్కువగా కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలడన్న నమ్మకం.. ఈసారి సభ్యుల్లో కలిగితే గనుక సునాక్ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. బరిలో సునాక్‌తో పాటు పెన్నీ మోర్డంట్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం నిలబడచ్చని అంచనా. నామినేషన్ల గడువు 24(సోమవారం) ముగియనుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీ మద్దతు సాధిస్తే.. వాళ్ల నుంచి ఇద్దరిని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓటింగ్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఆ ఇద్దరిలో మళ్లీ ఒకరిని ఓటింగ్ ద్వారా తమ నాయకుడిగా ఎన్నుకుంటారు.
ఓటింగ్ ఫలితాలను అక్టోబర్ 28న ప్రకటిస్తారు. ఆ గెలిచిన వ్యక్తిని బ్రిటన్ రాజు ఛార్లెస్-3.. బ్రిటన్ ప్రధానిగా ప్రకటిస్తారు. ఇవేం లేకుండా గడువులోగా ఒక్కరికే వంద మంది ఎంపీల మద్దతు గనుక లభిస్తే.. ఏకగ్రీవంగా ప్రధాని అవుతారు. ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు.