భోపాల్: మధ్యప్రదేశ్ రేవాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణ హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌పూర్ వెళ్తున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మధ్యప్రదేశ్ రేవాలోని సుహాగీ పహారీ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు.. ఓ లారీ కంటెయినర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. లారీ కంటెయినర్ వేగంగా వెళ్తున్న క్రమంలో.. ముందు వెళ్తున్న మరో ట్రక్‌ను ఢీకొట్టింది. ఈలోపు లారీ కంటెయినర్ డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడంతో.. వెనుక వేగంగా వస్తున్న బస్సు బలంగా ఢీ కొట్టి.. కంటెయినర్లోకి దూసుకెళ్లి ఉంటుందని ప్రమాదంపై ప్రాథమిక అంచనాకి వచ్చారు రేవా కలెక్టర్ మనోజ్ పుష్ఫ. ప్రయాణికులందరూ యూపీ వాసులుగా, వలస కూలీలుగా రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ ధృవీకరించారు. పండుగ కోసం వాళ్లంతా స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్లలో 20 మందిని ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారాయన..