విజయవాడ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ కాపాడుతోందని జై
భీమ్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. సీబీఐ
అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరి ఆదేశాలు అవసరం లేదని, నేరుగా అరెస్ట్ చేయవచ్చని
తెలిపారు. గతంలోనే అవినాష్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని,
ఒక్కరోజు కూడా అరెస్ట్ కాకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
మరి ఇన్ని రోజులు ఎందుకు అవినాష్‌ను అరెస్ట్ చేయలేదని శ్రవణ్ కుమార్
ప్రశ్నించారు. కావాలనే సుప్రీంకోర్టులో సీబీఐ తరపు న్యాయవాది విచారణకు
హాజరుకాలేదన్నారు. అదుపులోకి తీసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని
పోలీసులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.