2014-15 రెవెన్యూలోటు కింద ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’గా మంజూరు
గత ప్రభుత్వం అయిదేళ్లు గింజుకున్నా విదల్చని కేంద్రం
ఎన్నికల ఏడాదిలో జగన్ సర్కారుకు భారీ ఊరట
గుంటూరు : అప్పుల ఊబిలో కూరుకుపోతూ రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై
కేంద్రం కరుణ కురిపించింది. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్
ప్రభుత్వానికి.. సాధారణ పరిస్థితుల్లో కొన్ని నెలలపాటు వెనక్కి తిరిగి
చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం
నాటి రెవెన్యూలోటు కింద రూ.10,460.87 కోట్లు ఇచ్చింది. ‘ప్రత్యేక సాధారణ
ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ)
అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని
వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ
లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం
ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం
లేకపోయింది. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అధికారంలోకి
వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ నిధుల విషయమై ప్రధాని మోదీని
కలిసి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం ఆమోదంతో నిధులు
మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులిచ్చినా
విడతల వారీగా అందించేవారు. ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది
మునుపెన్నడూ లేదు. అదీ ఎన్నికల ఏడాదిలో రావడం విశేషం.
అప్పట్లో కొర్రీలు వేసిన కేంద్రం : రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు
నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి
విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విడుదల చేసిన కేంద్రం మిగిలిన సొమ్ముకు
కొర్రీలు వేసింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల
భర్తీపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ
నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో
2014-15 సంవత్సర వనరుల అంతరానికి (గ్యాప్) సంబంధించి కేంద్ర బడ్జెట్లో
పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి
రెవెన్యూలోటు రూ.16,078 కోట్లు తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15లో
రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు
కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన
మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే
ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త
పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
2018లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు
జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా
పరిగణించాలని కోరింది. 2014-15 నాటికి చెల్లించని (పెండింగ్) బిల్లులు
పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి
తీసుకోలేదు.
ఇటీవల సమాచారం కోరిన కేంద్రం: గత కొన్నేళ్లుగా రెవెన్యూ లోటు నిధుల భర్తీ
విషయమై కేంద్ర, రాష్ట్రాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. లోటు మొత్తాన్ని తిరిగి
ఇవ్వలేదని రాష్ట్రం వాదిస్తోంది. పలు దఫాలు వినతిపత్రాలు కూడా అందించింది.
అయినా దీన్ని ఏనాడూ పెద్దగా పట్టించుకోని కేంద్రం ఈ ఏడాది మార్చి నెలలో మాత్రం
రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు కోరింది. 2014-15, అంతకు ముందు సంవత్సరాలకు
సంబంధించి ఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిలో ఏ బిల్లులు ఎంత
చెల్లించలేదు మొత్తం సమాచారాన్ని రికార్డుల ఆధారంగా పంపాలని సూచించింది.