ముందస్తు బెయిల్‌పై 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలి
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్ట్ నుంచి రక్షించాలన్న ఆయన
అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అవినాష్ ముందస్తు బెయిల్
వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు మధ్యంతర రక్షణ
కల్పించేందుకు నిరాకరించింది. సీబీఐ అరెస్ట్, విచారణ నుంచి వారంరోజుల పాటు
మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్
నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం
చేసుకునేందుకు సిద్ధంగా లేమని వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్‌పై ఈనెల 25న
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు
ఆదేశించింది. వీలైనంత వరకు అదేరోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని
సూచించింది. అన్ని పక్షాలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం
ధర్మాసనం ఆదేశించింది.
ఈ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన కేసును తెలంగాణ
హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ
అవినాష్‌రెడ్డి వేసిన మిసిలేనియస్ అప్లికేషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
చేపట్టింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ
చేసిన నేపథ్యంలో అవినాష్‌రెడ్డి న్యాయవాదులు ఈ కేసును సోమవారం జస్టిస్
అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు ఉంచారు. తన తల్లి
అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందువల్ల తన
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం
విచారించి నిర్ణయం వెలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. విచారణకు
హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి ఆ
దరఖాస్తులో విన్నవించారు. కోర్టు ఈ కేసును మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి,
జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో
విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణపై తాజాగా
ఆదేశాలు జారీ చేసింది.