అమరావతి : పాలనా భాషగా తెలుగును అమలు పర్చడంలో సద్విమర్శలు చేస్తే
ఖచ్చితంగా స్వీకరిస్తామని, కానీ రాజకీయం చేస్తూ రాళ్లు విసరడానికి
ప్రయత్నిస్తే సముచిత స్థాయిలో సమాదానం చెపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు
అధికార భాషా సంఘం అద్యక్షులు పి.విజయబాబు పేర్కొన్నారు. సోమవారం అమరావతి
సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అధికార
భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఈ మద్యకాలంలో చేసిన విమర్శలకు ఆయన స్పదించారు.
పాలనా భాషగా తెలుగు భాషాభివృద్దికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తే, వాటిని
తప్పక పాటిస్తామని, అనుసరిస్తామని, భాషకు సంబందించిన అంశాలను రాజకీయం చేయడం
ఏమాత్రం తగదని ఆయన హితవు పలికారు. ఎటు వంటి వ్యవస్థకైనా పరిమితులు, పరిధులు
ఉంటాయని, వాటికి అనుగుణంగానే చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.
పాలనా భాషగా తెలుగును అమలు పర్చడం అనే విషయం
దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితుల్లో ఒక్కసారే పురోగతిని
సాధించడం ఎంతో అసాధ్యమన్నారు. 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన
తదుపరి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పాటు చేయబడినప్పటికీ పాలనా భాషగా
తెలుగును అమలు పర్చడంలో ఎంతో నిర్లక్ష్యం వహించడం జరుగుచున్నదన్నారు. అటు వంటి
పరిస్థితుల్లో పాలనా భాషగా తెలుగును శతశాతం అమలు చేయడం ఒక్కరోజులో సాద్యమయ్యే
పనికాదని, అయినప్పటికీ ఎంతో అంకిత భావంతో కృషి చేయడం జరుగుచున్నదన్నారు.
ఇప్పటి వరకూ 55 శాతం మేర ప్రగతిని సాదించడం జరిగిందన్నారు. మరింత ప్రగతిని
సాదించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, పాలనా భాషగా తెలుగును మరింత
పటిష్టంగా అమలు పర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా
లేఖ వ్రాయడం జరిగిందన్నారు. పాలనాబాషగా తెలుగును అమలు పర్చడానికి ప్రభుత్వ
పరంగా అధికార భాషా సంఘం అవిరళ కృషిచేస్తున్నదని, విస్తృతంగా సమీక్షలు,
సమావేశాలు నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రచయితలను, సాహితీ వేత్తలను కూడా
పెద్ద ఎత్తున సత్కరించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే
తిరుపతి, రాజమండ్రిల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని, వచ్చే
బుధవారం విజయవాడలో, గురువారం మచిలీపట్నంలో సమీక్షా సమావేశాలను
నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
పేరుతో ఈ దేశంలోని సుప్రసిద్ద ప్రముఖులను విజయవాడ, రాజమండ్రి, ఏలూరు మరియు
గుంటూరులో రెండు సార్లు సత్కరించుకోవడం జరిగిందన్నారు. నాగార్జునా
యూనివర్శిటీ, ఆంధ్ర విశ్వవిధ్యాలయంలో కూడా కార్యక్రమాలను నిర్వహించడం
జరిగిందన్నారు. అదే విధంగా త్వరలో ఉత్తరాంధ్ర సాహిత్య సమావేశాన్ని
విశాఖపట్నంలోను, భాషా బ్రహ్మోత్సవాలను తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆయన
తెలిపారు.
పాలనా భాషగా
తెలుగును అమలు పర్చడంలో ఎన్నో సమస్యలు తలెత్తుత్తున్నాయని, మౌఖిక భాష లేక
గ్రాంధిక భాష లేక శుద్ద గ్రాంథిక భాషను ఉపయోగించాలా అనే అయోమయంలో ప్రభుత్వ
ఉద్యోగులు ఉన్నారన్నారు. వారికి తగు సూచనలు చేస్తున్నామని, నమూనా పట్టికలను
కూడా తయారు చేసి వాళ్లకు ఇస్తామని, వాటిని ఉద్యోగులు అమలు పర్చనప్పుడు తగు
చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలుగు వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు
చేస్తామన్నారు. వనరులు పరిమితం, ఆలోచనలు అపరిమితమని, ఆ పరిధిలోనే పురోగతిని
సాధించేందుకు కృషిచేయడం జరుగుచున్నదన్నారు. న్యాయ మూర్తుల తీర్పులు కూడా
తెలుగులో వచ్చేలా కృషిచేస్తున్నామన్నారు.