మచిలీపట్నం : బందరు పోర్టు అంటే ఇక్కడి ప్రజల తీరని కోరిక, డచ్, పోర్చుగీస్
వారు జెట్టీ కట్టి పోర్టు పనులు చేసిన చరిత్ర బందరుది. కానీ ఈ రోజు నిజమైన
పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని
బాలశౌరి అన్నారు. గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారు కానీ దానికి ఫైనాన్షియల్
క్లియరెన్స్‌లు లేవు, డబ్బులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు కానీ నాలుగు
రోజులు లేట్ అయినా అన్ని అనుమతులు తీసుకొచ్చి చిత్తశుద్దితో పోర్టు పనులు
ప్రారంభించిన వ్యక్తి మన సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. మచిలీపట్నం పోర్టు
నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎంపీ వల్లభనేని
బాలశౌరి మాట్లాడుతూ మంచి పనులు చేస్తే చరిత్ర ఎప్పుడూ మరిచిపోదు. ప్రకాశం
బ్యారేజ్, ఆ రోజు కాటన్ దొరగారి బిక్ష, ఇప్పటికీ కృష్ణా డెల్టా రైతాంగం
మరిచిపోదు, ఆ తర్వాత కృష్ణా డెల్టా రైతాంగం కోసం పులిచింతల ప్రాజెక్ట్
అవసరమని దివంగత సీఎం వైఎస్సార్ పులిచింతల పూర్తి చేసి 45 టీఎంసీల నీటిని
నిలబెట్టిన మొనగాడు, అదే విధంగా ఆయన తనయుడు మన రాష్ట్రంలో ఇన్ని పోర్టులు
నిర్మించి దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అభివృద్ది అంటే మాటలు
కాదు చేసి చూపించడం, విశాఖ, ముంబాయి, చెన్నై అభివృద్ది చెందాయి అంటే పోర్టుల
వల్లే, మచిలీపట్నం కూడా ఈ దేశ చిత్రపటంలో ఒక మంచి పోర్టుగా అభివృద్ది
చెందబోతుంది. ఈ పోర్టుకు ఉన్న సాల్ట్ భూముల్లో పరిశ్రమలు పెడితే అభివృద్ది
చెందడంతో పాటు బందరు ప్రజానీకానికి ఉద్యోగాలు వస్తాయి. పోర్టు పూర్తయ్యేసరికి
మంచి రహదారులు కూడా రాబోతున్నాయి, దివిసీమ ప్రజానీకం చిరకాల కోరిక
మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్, దీనిపై గతంలో కూడా చర్చించాం, పీఎం గతిశక్తి
స్కీం ద్వారా దీనిని కూడా పోర్టు ప్రాజెక్ట్‌లో కలిపితే దివిసీమ ప్రజల కోరిక
నెరవేరుతుంది. పోర్టుకు ఉపయోగపడుతుంది. నేను తెనాలి ఎంపీగా ఉన్నప్పుడు
పులిచింతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగస్వామి అయ్యాను, అదే విధంగా బందరు
ఎంపీగా ఈ పోర్టు విషయంలో భాగస్వామిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని
వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.