లండన్ : భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రేవర్మన్
వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాదిలో అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు లండన్
వెలుపల అతి వేగంగా కారును నడిపినందుకు వేసిన ఫైన్, పాయింట్లను
దాచిపెట్టేందుకు ప్రయత్నించారని ఆమెపై విమర్శలొచ్చాయి. ఈ విషయంలో సహాయం
చేయాల్సిందిగా ఆమె అధికారులను కోరినట్లు బ్రిటన్ మీడియా కథనాలను
ప్రచురించింది. బ్రిటన్‌లో అతి వేగంగా కారు నడిపితే ఫైన్ విధిస్తారు.
దీంతోపాటు అవేర్నెస్ కార్యక్రమానికి బృందంతోగానీ, ఆన్‌లైన్‌లోగానీ హాజరు
కావాల్సి ఉంటుంది. లేదంటే లైసెన్సులో పాయింట్లను నమోదు చేస్తారు. అవి
ఎక్కువైతే లైసెన్సు రద్దవుతుంది. మీడియా కథనం ప్రకారం అవేర్నెస్
కార్యక్రమానికి అందరితో కలిసి వెళ్తే విషయం బయటపడుతుందని, అందరూ తననే
చూస్తారనే ఉద్దేశంతో తన ఒక్కరికే విడిగా ఏర్పాటు చేసేలా మేనేజ్ చేయాలని
అధికారులను బ్రేవర్మన్ కోరారు. అధికారులు తిరస్కరించడంతో ఆమె రాజకీయ సహాయం
కోరారు. రాజకీయ సహాయకుడి సాయంతో తనకు విడిగా అవేర్నెస్ కోర్సును ఏర్పాటు
చేయాలని ఆన్లైన్ నిర్వాహకుడికి విజ్ఞప్తి చేశారు. దీంతో బ్రేవర్మన్ తీరుపై
విపక్షాలు మండిపడ్డాయి. స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి.