హిరోషిమా : జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు హిరోషిమా వచ్చిన వివిధ దేశాల
నేతలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ విడివిడిగా భేటీ
అయ్యారు. రష్యా తమపై కొనసాగిస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టేందుకు సహాయపడాలని
విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సందర్భంగా సుమారు రూ.3108
కోట్ల(375 మిలియన్ డాలర్ల) తాజా సాయాన్ని ప్రకటించారు. రష్యా సేనల్ని
ఎదుర్కొనేందుకు మందుగుండు సామగ్రిని, సాయుధ శకటాలను సరఫరా చేస్తామని హామీ
ఇచ్చారు. ఉక్రెయిన్ పైలట్లకు ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణపై శిక్షణ
ఇచ్చేంద]ుకు ఇప్పటికే అమెరికా అంగీకరించింది. అయితే, ఈ విమానాలను రష్యా
భూభాగాలపై దాడికి వినియోగించబోమని జెలెన్స్కీ వాగ్దానం చేశారని బైడెన్
తెలిపారు. దీంతో అమెరికా తయారీ ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు
అందించేందుకు మార్గం సుగమం కానుంది. జెలెన్స్కీ హిరోషిమా చేరుకోక ముందే జీ7
దేశాలు రష్యాపై సరికొత్త ఆంక్షలను ప్రకటించాయి. జీ7 దేశాల భేటీపై రష్యా రక్షణ
మంత్రి లవ్రోవ్ విమర్శలు సంధించారు. అంతర్జాతీయంగా చైనా, రష్యాలను ఒంటరి
చేయాలన్నదే ఆ సదస్సు లక్ష్యమని దుయ్యబట్టారు.
రష్యా సేనలు వెనక్కి వెళితేనే చర్చలు : భారత ప్రధాని నరేంద్ర మోడీ , దక్షిణ
కొరియా, బ్రెజిల్ తదితర దేశాల అధినేతలతోనూ జెలెన్స్కీ ముఖాముఖి చర్చలు
జరిపారు. మాస్కోతో శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే తొలుత తమ భూభాగాల నుంచి
రష్యా సేనలు వెనక్కు తరలి వెళ్లాలన్న డిమాండ్‌ను ప్రధాని మోడీ ముందు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉంచినట్లు తెలిసింది.