ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి
ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు
విజయవాడ : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్నిసీఎం జగన్ మోహన్ రెడ్డి బలోపేతం
చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి
తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య
ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి.
ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర
చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా
ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు
సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల
వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా
పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా
36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు.
ఇంకా ఎన్నెన్నో సేవలు : 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108
అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి
చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను
విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు
సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104
ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది.
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104
ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది
ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్
తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది
బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన
మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో
105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను
సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు.
మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే
అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి
వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్
ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో
నీతి ఆయోగ్ తెలిపింది. క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3
రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న
రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం
చేసింది. హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య
శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న
రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది.
కొరతకు తావు లేకుండా : రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి
ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే
పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు
ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర
ఉండగా ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో
కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం
ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు
మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను
మాత్రమే భర్తీ చేశారు.
సగటున రోజుకు 1,360 సర్జరీలు : బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817
మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు
నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు
ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253
చొప్పున 8.22 లక్షలు నమోదయ్యాయి.
ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు :వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య
విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బాబ్జీ
బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు
వస్తున్నాయని వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్
చాన్స్‌లర్ డాక్టర్ బాబ్జీ పేర్కొన్నారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో
ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారని, . మన దగ్గర 60 శాతం గ్రామీణ
జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న
చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే
పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో
ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే
వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందన్నారు.