జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బీసీలకు ప్రయోజనాలు కల్పించడంలో కేంద్రం పూర్తిగా
వైఫల్యం చెందిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్
రావు అన్నారు. ప్రణాళికా బద్ధంగా ఆదుకోకపోవడం, వ్యూహాత్మకంగా ఈ వర్గాలను
నిర్లక్ష్యం చేయడమే అని అన్నారు. ఈ వర్గాల హక్కుల ప్రయోజనాల నిమిత్తం
జాతీయస్థాయిలో మరో స్వాతంత్ర సమరం నిర్మించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా 75
కోట్ల జనాభా గలిగిన బీసీలను ఇంతగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి చేసిన
పోకడలను, విధానాలను గతంలో ఎప్పుడు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ
బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల సమావేశం
ఆదివారం కాచిగూడ లోని బీసీ దళ్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్
వకుళభరణం ప్రసంగిస్తూ ఈ తొమ్మిదేళ్లలో కేంద్రం బీసీల నిమిత్తం ఒక్క పథకం కూడా
ఆరంభించలేదన్నారు. బడ్జెట్ కూడా నామమాత్రంగా కేటాయింపులు చేశారన్నారు. నేడు
దేశంలో బీసీలు రెండవ తరగతి పౌరులుగా నిర్లక్ష్యం కాబడుతున్నారని భావనలోకి
వెళ్లారన్నారు. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్య మౌలికతకు విఘాతం కలిగించేదే
అన్నారు. నిర్మాణాత్మకమైన సిద్ధాంత భావజాల వ్యాప్తితో దేశంలోని బీసీలు సంఘటిత
పోరుకు సిద్ధం కావాలన్నారు.
జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ దేశంలో బీసీల
అభివృద్ధిని,సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇక్కడేమో బిజెపి నాయకులు శుష్క
వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా వుంది అన్నారు. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా
సమావేశంలో చేసిన హామీలు కల్లబొల్లి కబుర్లే అన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన
చేయబోమని చెప్పిన మోడీ ప్రభుత్వం నిజస్వరూపం బట్టబయలైన నేపథ్యం లో కూడా,
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగనన చేపడతామని ప్రకటించడం విస్మయాన్ని
కలిగిస్తుందన్నారు .దేశంలోని బీసీలకు వార్షిక బడ్జెట్లో కేవలం రెండు వేల
కోట్లు కేటాయించిన కేంద్రము నిలదీసే శక్తి లేని రాష్ట్ర బీజేపీ నాయకులకు,
ఇక్కడేమో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే జనాభా మేరకు నిధులు మంజూరు
ఉంటుందని హామీ ఇవ్వడము
తప్పుదోవ పట్టించడమే అన్నారు. రాష్ట్ర బిజెపి నేతల వైనం శుష్క వాగ్దానాలు
-శూన్య హస్తాలు అన్న చందంగానే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో భారీ
ఎత్తున జిల్లాలలో వివిధ ప్రక్రియలలో బీసీలను సంఘటితం చేసి ఉద్యమిస్తామని ఆయన
అన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.