మహ్మద్ వసీమ్ (50, 1/16) ఆల్‌రౌండ్ షోతో యూఏఈ జట్టు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి విజయం అందుకుంది. గురువారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ గ్రూప్ ‘ఎ చివరి మ్యాచ్‌లో ఏడు పరుగులతో నమీబియాను ఎమిరేట్స్ ఓడించింది. ఓటమితో నమీబియా రౌండ్-12 ఆశలు గల్లంతయ్యాయి. ఇదే గ్రూపులో ఉదయం జరిగిన పోరులో నెదర్లాండ్స్‌ను శ్రీలంక ఓడించడంతో..నమీబియాతో పోరుకు ముందే మెగా టోర్నమెంట్‌నుంచి యూఏఈ నిష్క్రమణ ఖాయమైంది. ఇక తొలుత యూఏఈ 20 ఓవర్లలో 148/3 స్కోరు చేసింది. వసీమ్‌తోపాటు కెప్టెన్ రిజ్వాన్ (43), బాసిల్ (25 నాటౌట్) సత్తా చాటారు. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 141/8 స్కోరు చేసి త్రుటిలో విజయం చేజార్చుకుంది. మిగిలిన బ్యాటర్లంతా విఫలమైనా.. వీజ్ (55), ట్రంపెల్మన్ (25 నాటౌట్) పట్టుదలగా ఆడి 8వ వికెట్‌కు 70 రన్స్ జోడించి చివరివరకూ పోరాడారు. అయినా ఫలితం లేకపోయింది.